జైళ్లలో భద్రతకు భరోసా .. రాష్ట్రవ్యాప్తంగా 37 జైళ్లలో సెక్యూరిటీ ఆడిట్‌‌

జైళ్లలో భద్రతకు భరోసా .. రాష్ట్రవ్యాప్తంగా 37 జైళ్లలో సెక్యూరిటీ ఆడిట్‌‌
  • జైలు గేట్లు, గోడలు,ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో భద్రత, సాంకేతిక పరికరాల పనితీరుపై జైళ్ల శాఖ పరిశోధన ప్రారంభించింది. ఇందులో భాగంగా చంచల్‌‌గూడ, చర్లపల్లి సెంట్రల్‌‌  జైళ్లతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా జైల్లు, సబ్ జైళ్లలో సమగ్ర భద్రతా తనిఖీలు (సెక్యూరిటీ ఆడిట్‌‌) లు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా శనివారం ప్రారంభించారు. డీఐజీలు, జిల్లా జైళ్ల సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో తనిఖీలు జరుగుతున్నాయి. జైళ్ల భద్రతను బలోపేతం చేయడం, నిర్వహణ ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా సెక్యూరిటీ ఆడిట్  చేపట్టారు. రాష్ట్రంలోని 37 జైళ్లలో ఆయా ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా జైళ్లను సందర్శించి, నిబంధనలు అమలులో ఉన్నాయా? లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. 

ప్రధానంగా జైలు గేట్ల వద్ద స్కానర్ల పరిశీలన, చెకింగ్‌‌, సందర్శకుల గుర్తింపుకు సంబంధించి డాక్యుమెంట్ల పరిశీలన, ములాఖత్‌‌లకు రిజిస్ట్రేషన్‌‌  వివరాలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. నిఘా వ్యవస్థలో భాగంగా సీసీటీవీ కెమెరాల పనితీరు, ప్రొటోకాల్స్ రికార్డింగ్‌‌, కమ్యూనికేషన్  సిస్టం పరికరాల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జైలు గోడల దృఢత్వంతో పాటు లైవ్ వైర్  వ్యవస్థలు, వాచ్‌‌టవర్ల పరిస్థితి సహా ఆయుధాలు, ఇతర భద్రతా పరికరాల నిర్వహణను పరిశీలిస్తున్నారు. 

దీంతో పాటు డ్యూటీ రోస్టర్లు, ఎంత మంది  సిబ్బంది డ్యూటీలో ఉన్నారనే వివరాలను చెక్  చేస్తున్నారు. జైళ్లలో ఉన్న ఖైదీల మానసిక, ఆరోగ్య పరిస్థితులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం లాంటి చర్యలు చేపట్టారు. రెగ్యులర్, ఆకస్మిక తనిఖీలు, స్కానర్  వినియోగం, నిషిద్ధ వస్తువులను గుర్తించడం, వారంట్లు, అడ్మిషన్లు, రిలీజ్‌‌కు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాటారు.ఖైదీల సంక్షేమాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుని ‘ఖైదీల సంస్కరణ, పునరావాస నిర్వహణ’ అనే  అంశంపై జైళ్ల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందని డీజీ సౌమ్యా మిశ్రా తెలిపారు.‌‌