రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖను పోలీస్ శాఖలో భాగంగా పరిగణించట్లేదా? అనే ప్రశ్న ఎదురవుతోంది. క్రిమినల్స్‌ను పట్టుకుని.. కోర్టుకు అప్పజెప్పడంతో పోలీసు శాఖ పని అయిపోతుంది. కానీ వారికి శిక్షపడి, జైలు లోపలికి అడుగుపెట్టిన దగ్గర్నుంచి వాళ్ల విధులు చూడాల్సింది జైల్ జవానులే. నెలల తరబడి జైళ్లలో ఉండేవారిని కంటికి రెప్పలా కాపాడాలి. ఒక్కడు తప్పించుకున్నా ఉద్యోగం పోయినట్టే. సెలవులు తక్కువ, ఇంక్రిమెంట్లు ఉండవు.. హెల్త్ విషయంలో పట్టింపు ఉండదు. హార్డ్ వర్క్ చేసే జైల్ జవాన్లకు జీతాలు, సౌకర్యాలు అనుకున్న స్థాయిలో ఉండవు. ఇదంతా చూస్తుంటే జైళ్లశాఖ అంటే ప్రభుత్వానికి చిన్న చూపేనా? అనిపిస్తోంది.
తెలంగాణ జైళ్ల శాఖలో జవాన్‌కు ఇస్తున్న యూనిఫాం, అలవెన్స్ ఒక హోం గార్డ్‌కు ఇచ్చే యూనిఫాం, అలవెన్స్ కంటే 50% తక్కువ. హోంగార్డ్‌కు రూ.7,500 యూనిఫాం అలవెన్స్ ఉండగా, జైల్ జవాన్‌కు రూ.3,500 యూనిఫాం అలవెన్స్ ఇస్తున్నారు. ఇతర యూనీఫాం శాఖల మాదిరిగా కాకుండా ప్రతిరోజూ కచ్చితంగా డ్యూటీ టైంలో యూనీఫాం వేసుకుని పనిచేసేది జైల్ జవాన్ మాత్రమే. 1,200 నుంచి 1,300 మంది ఉద్యోగులు జైళ్ల శాఖలో పనిచేస్తున్నారు. చిన్న శాఖల్లో ప్రభుత్వానికి ఆదాయం ఇస్తున్న శాఖ ఇదే. కరుడుగట్టిన, పేరుమోసిన ఖైదీలను పోలీసులు చివరకు జైళ్ల శాఖకు అప్పగిస్తారు. జైళ్ల శాఖ వారు విడుదలయ్యే వరకు వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పోలిస్తే జైళ్ల శాఖ ఉద్యోగులకు ముప్పు ఎక్కువే.
జైలర్ల డిమాండ్లు..
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ఎస్ఐ, సీఐ స్థాయి ఉద్యోగులకు వెహికల్‌తోపాటు మరికొన్ని అదనపు సదుపాయాలను అందిస్తోంది. కానీ జైళ్ల శాఖలో అదే స్థాయి ఉద్యోగులైన డిప్యూటీ జైలర్, జైలర్ స్థాయి కేడర్ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు అందడం లేదు. ప్రభుత్వం తమకు కూడా వెహికల్ ఇతర సదుపాయాలు కల్పించాలని, ఎస్ఐ, సీఐతో సమానంగా తమను చూడాలని డిప్యూటీ జైలర్లు , జైలర్లు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు శాఖలో ఉద్యోగులకు సెలవులను 45 ఇవ్వగా.. జైళ్ల శాఖలో మాత్రం 30కి కుదించింది. ఇందులో కూడా వేరే యూనీఫాం శాఖ వారు 30 లీవ్స్ సరెండర్ చేసే వీలుండగా వీరికి 15 మాత్రమే సరెండర్ చేసే అవకాశం ఉంది. స్పెషల్ అలవెన్స్, అదనపు సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఆరోగ్య భద్రత ద్వారా నగదు రహిత వైద్య సదుపాయాలు, గృహ రుణం, విద్యా రుణాలు పోలీసు శాఖ ఉద్యోగులకు ఉంటున్నాయి. జైళ్ల శాఖ ఉద్యోగులకు వార్డర్ నుంచి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ జైళ్ల వరకు స్పెషల్ అలవెన్స్, స్పెషల్ పే, అడిషనల్ సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఆరోగ్య భద్రత వంటి సౌకర్యాలు కల్పించడం లేదు.
ప్రభుత్వం గుర్తించాల్సిన విషయాలు..
జైళ్ల శాఖ కూడా పోలీస్ శాఖలో భాగమేనన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. వీరి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని పోలీస్ శాఖ ఉద్యోగులకు అందించే అన్ని రకాల సౌకర్యాలను జైళ్ల శాఖ సిబ్బందికి కల్పించాలి. ఇక పిల్లల చదువులకు, విదేశాలకు వెళ్లేందుకు జైళ్ల శాఖ ఉద్యోగులకు అవకాశం ఇవ్వకపోవడంతో వీరి పిల్లల చదువులపై ప్రభావం పడుతోంది. ఇండ్ల నిర్మాణం విషయంలో కూడా వీరికి ఎలాంటి హౌసింగ్ సొసైటీ లోన్లు ప్రభుత్వం నుంచి అందడం లేవు. ఏసీబీ, గ్రే హౌండ్స్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ మొదలైన వాటితో పోల్చినప్పుడు జైళ్ల శాఖ ఉద్యోగం చాలా కఠినమైనది. వారు నిత్యం ప్రమాదకరమైన, కరుడుగట్టిన ఖైదీలతో మెలగాల్సి ఉంటుంది. 24 గంటలు వారి మధ్యే గడపాల్సి ఉంటుంది. జైలులో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న వార్డర్ నుంచి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ జైళ్ల వరకు ప్రత్యేక అలవెన్స్ అందించాలి. జైలు డిపార్ట్మెంట్లోని ఉద్యోగులందరికీ ప్రాథమిక వేతనంలో 50 శాతం వరకు ప్రత్యేక అలవెన్స్ గాఅందించాల్సిన అవసరం ఉంది. జైళ్ల శాఖ ఉద్యోగులు జిల్లా కేడర్, జోనల్ కేడర్, మల్టీ జోనల్ కేడర్, స్టేట్ కేడర్‌గా విభజించారు. కానీ జైళ్లశాఖలో అన్ని జిల్లాల్లో పోస్టులు లేవు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జైళ్లశాఖలో పోస్టులు సృష్టించాల్సిన అవసరం ఉంది.
- దశరథరెడ్డి, ఎనలిస్ట్