ముంబై: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో పాల్గొనే ముంబై జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియాకు దూరమైన ఓపెనర్ పృథ్వీ షా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘దేవుడా ఇలాంటివి ఇంకెన్ని చూడాలి’ అంటూ సోషల్ మీడియా పోస్టులో తన నిర్వేదాన్ని వ్యక్తం చేశాడు. ఈ పోస్టులో తన లిస్ట్–ఎ కెరీర్ గణాంకాలను ప్రస్తావించి తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు.
‘దేవుడా.. ఇంకెన్ని చూడాలో చెప్పు. 65 ఇన్నింగ్స్‌ల్లో 55.7 సగటు, 126 స్ట్రయిక్ రేట్‌తో చేసిన 3399 రన్స్ సరిపోవా? అయినా నీపై విశ్వాసం ఉంచుతాను. ప్రజలు ఇంకా నన్ను నమ్ముతున్నారని భావిస్తున్నా. ఎందుకంటే నేను కచ్చితంగా తిరిగొస్తా. ఓం సాయిరాం’ అని షా చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీజన్ రంజీ ట్రోఫీలోనూ ముంబై జట్టు నుంచి ఉద్వాసనకు గురైన పృథ్వీని ఐపీఎల్ వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.