భారత ఆటగాళ్లను గాయాల బెడద ఇప్పట్లో వదిలేలా లేదు. ఒక ఆటగాడు దాని నుంచి కోలుకున్నారు అనుకునేలోపే మరొక ఆటగాడు గాయపడుతున్నారు. తాజాగా, ఇంగ్లండ్ గడ్డపై సెంచరీల మోత మోగిస్తున్న టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడ్డారు. డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ షా.. టోర్నీకే దూరమయ్యాడు.
ఆదివారం డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా పృథ్వీ షా మోకాలికి గాయం అయ్యింది. ఆపై స్కానింగ్ నిర్వహించగా.. నేడు(బుధవారం) ఉదయం ఆ రిపోర్ట్స్ వచ్చాయి. అందులో గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను ఈ టోర్నీకి దూరమైనట్లు నార్తంప్టన్‌షైర్ జట్టు ప్రకటన చేసింది.
Prithvi Shaw ruled out of the One-Day Cup due to a knee injury. pic.twitter.com/EDMBx11YCl
— Johns. (@CricCrazyJohns) August 16, 2023
గాయంతోనే బ్యాటింగ్ చేసి.. సెంచరీ
డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ షా.. అలానే బ్యాటింగ్ చేశాడు. 76 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 119 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం నార్తంప్టన్ షైర్ కోచ్.. షాపై ప్రశంసలు కురిపించాడు. తమ జట్టు తరఫున ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయినా చాలా ప్రభావం చూపాడని కొనియాడారు. అతన్ని మిస్సవుతుండటం చాలా బాధాకరంగా ఉందని చెప్పుకొచ్చాడు.
బాబా.. షాకు ఎందుకు ఈ పరీక్ష!
భారీ ఇన్నింగ్స్‌లతో ఇప్పుడిప్పుడే సెలెక్టర్ల దృష్టిలో పడుతున్న షా.. అంతలోనే గాయపడటం అభిమానుల మనసును కలిచివేస్తోంది. ఈ క్రమంలో షా.. ఇష్టదైవం సాయిబాబాను తలుస్తూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'సాయి బాబా.. షాకే ఎందుకు ఈ పరీక్ష! అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏడాది క్రితం షా.. తనను ఎంపిక చేయనందుకు సెలెక్టర్లను తీరును తప్పుబడుతూ అంతా సాయి బాబా చూస్తున్నారంటూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చిన విషయం తెలిసిందే.
కాగా, సోమర్‌సెట్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో షా డబుల్ సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్స్‌ల సాయంతో 244 పరుగులు చేశాడు.