అధిక బరువు, ప్రాక్టీస్ సెషన్లకు పదే పదే డుమ్మా కొట్టడం వంటి కారణాలపై భారత యువ క్రికెటర్ పృథ్వీ షాపై వేటు పడిన విషయం తెలిసిందే. అతన్ని తప్పిస్తూ ముంబై క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. తాజాగా, ఈ విషయంపై స్పందించిన షా.. ముంబై అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం సరైనదేలా వ్యవహరించాడు. తప్పించినందుకు ధన్యవాదాలు.. అంటూ ముంబై అసోసియేషన్ అధికారులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
నీడ్ ఏ బ్రేక్..
ముంబై రంజీ జట్టు నుంచి నిష్క్రమించిన తర్వాత పృథ్వీ షా సోషల్ మీడియాలో నాకు విరామం కావాలి.. అడగకుండానే మీరే బ్రేక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నట్లు పోస్ట్ చేశాడు. 'నీడ్ ఏ బ్రేక్.. థాంక్స్' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. అందుకు నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. దీనిని బట్టి, జట్టు నుంచి తప్పించడంలో అతనికి ఎలాంటి బాధలేదని స్పష్టమవుతోంది.
ప్రాక్టీస్‌కు రావట్లే.. బరువు తగ్గట్లే
ఈ 24 ఏళ్ల బ్యాటర్ శరీరంలో 35 శాతం కొవ్వు ఉందని టీమ్ మేనేజ్‌మెంట్ MCA ద్రుష్టికి తేవడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ తయారు చేసింది. దానిని క్రమం తప్పకుండా రెండు వారాల పాటు అనుసరించాల్సిందిగా అసోషియేషన్ అధికారులు షాను కోరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దానిని అతను పాటించకుండా దాటవేశాడని సమాచారం. దీన్ని పక్కనపెడితే అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ వంటి భారత స్టార్లు సెషన్లకు క్రమం తప్పకుండ వస్తుంటే, షా డుమ్మా కొడుతున్నాడట. ఈ క్రమంలో అతనికి గుణపాఠం చెప్పడానికి ఎంపిక ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది.
ALSO READ | KL Rahul: రాహుల్ గొప్ప బ్యాటర్.. భయపడాల్సింది లేదు: భారత మాజీ స్పిన్నర్
ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్‌లో ఈ ఓపెనర్ రెండు రంజీ మ్యాచ్‌ల్లో బరోడాపై 7, 12.. మహారాష్ట్రపై 1, 39 నాటౌట్ పరుగులు చేశాడు.