ఆరోగ్యశ్రీ ఉన్నా పైసలు కట్టాల్సిందే.. రోగులను దోచుకుంటున్న ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్​

ఆరోగ్యశ్రీ ఉన్నా పైసలు కట్టాల్సిందే.. రోగులను దోచుకుంటున్న ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్​
  • ‘ఆరోగ్యశ్రీ’ రేట్లు పెంచినా ఆగని దోపిడీ
  • స్కీమ్​లో వచ్చే రాడ్స్, స్టంట్ ​సెకండ్ ​క్వాలిటీవని బుకాయింపు
  • హై క్వాలిటీవి వాడాలంటూ కౌన్సెలింగ్.. రూ.50వేల దాకా వసూలు​
  • డాక్టర్ చార్జీలు, ఇతర సర్వీసుల పేరుతో రూ.20 వేల వరకు చార్జ్
  • చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని ఆస్పత్రులదీ అదే తీరు
  • ఫిర్యాదు చేద్దామంటే కనిపించని కంప్లయింట్​ బాక్సులు


హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేస్తున్నా.. పేద రోగుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ పైసలు వసూలు చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెబుతూనే.. ఆపైన డబ్బులు గుంజుతున్నాయి. కొన్నిసార్లు చేసే ట్రీట్​మెంట్​​లో తేడా ఉంటుందని.. మరికొన్నిసార్లు ఆర్థో, హార్ట్ సర్జరీలు అయితే వేసే రాడ్​, స్టంట్ క్వాలిటీవి వేస్తామని రోగుల నుంచి పైసలు దండుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రేట్లను పెంచినా కూడా ఈ దందా ఆగడం లేదు. ఏం వైద్యం చేస్తున్నారనే దానిపై పేద రోగులకు అవగాహన లేకపోవడం, తమను స్పెషల్​గా ట్రీట్ చేస్తున్నారనే అపోహతో ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు అడిగిన కాడికి ఇచ్చుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ కింద దాదాపు 374 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇందులో నిర్వహించే ప్రతి సర్జరీకి, ప్రతి ట్రీట్​మెంట్​కు ఆరోగ్య శ్రీ కొన్ని రేట్లను ఫిక్స్ చేసింది. దాని ప్రకారం పేద రోగులు ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్​మెంట్​ చేయించుకుంటే.. దానికి సంబంధించిన వివరాలను పూర్తి డాక్యుమెంట్​తో అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ముందుగా పేషెంట్ ఆరోగ్య శ్రీ కింద చికిత్స తీసుకోవాలంటే కూడా ఏ ట్రీట్​మెంట్​ అవసరం ఉందో దానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు ఆన్​లైన్​లో పంపి అప్రూవల్ తీసుకోవాలి. 

సర్జరీ లేదా చికిత్స పూర్తయిన తర్వాత  మిగిలిన వివరాలను ఆరోగ్య శ్రీ లాగిన్​లో ప్రైవేట్ హాస్పిటల్స్ అప్ డేట్ చేస్తాయి. అయితే యాక్సిడెంట్ లేదా కింద పడి కాళ్లు, చేతులు విరిగినోళ్లు సాధారణంగా ప్రైవేట్ హాస్పిటల్స్​కు పరుగులు తీస్తారు. ఆరోగ్య శ్రీ కింద ప్రైవేట్​లోనే మంచి వైద్యం దక్కుతుందని వెళ్తారు. ఆరోగ్య శ్రీ ఉండడతో జాయిన్  చేసుకుంటున్న ప్రైవేట్​ ఆస్పత్రులు.. అనంతరం కొంచెం మంచి రాడ్​ వేయాలంటే అదనంగా క్యాష్​ చెల్లించాల్సి ఉంటుందని పేషెంట్ కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తున్నాయి. ఎముకలు విరిగిన కేసులో ఆరోగ్య శ్రీ కింద రూ.లక్ష వస్తాయనుకుంటే.. పేషెంట్​ దగ్గర నుంచి వీటికి అదనంగా ఇంకో రూ.40 వేలు వసూలు చేస్తున్నారు. 

ఆరోగ్య శ్రీ ఎంప్యానల్​లో ఉన్న దాదాపు 80 శాతం ప్రైవేట్ హాస్పిటల్స్​లో ఈ తంతు యథేచ్చగా సాగుతున్నది.  ఇలా హార్ట్ స్టెంట్ల దగ్గర నుంచి.. ఏ ట్రీట్​మెంట్​ తీసుకున్నా పేషెంట్ల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. హార్ట్​ స్టెంట్ల విషయానికొస్తే.. మంచి క్వాలిటీ స్టెంట్ వేస్తామని చెబుతూ అదనంగా రూ.50 వేల దాకా ప్రైవేట్ హాస్పిటల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇలా ఆరోగ్య శ్రీ కింద ఫ్రీ ట్రీట్​మెంట్​ ఉంది కదా అని ప్రైవేట్ హాస్పిటల్స్​కు వెళ్తున్న రోగుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. ఎవరైనా తాము చెల్లించుకోలేమని.. ఆరోగ్య శ్రీ కిందనే ఎంత వస్తే అదే చేయాలని చెబితే.. డాక్టర్ చార్జీలు, ఇతర హాస్పిటల్ సర్వీసుల పేరుతో కనీసం రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా వసూలు చేస్తున్నట్టు తెలిసింది.

డబ్బులు దండుకున్నా వేసేది ఆరోగ్య శ్రీ రాడ్​లే

ఒకవైపు ఆరోగ్య శ్రీలో వచ్చేదానికంటే నాణ్యమైన రాడ్​, స్టెంట్​ వేస్తామని క్యాష్ తీసుకుంటున్న ప్రైవేట్​ హాస్పిటల్స్.. సర్జరీలో మాత్రం ఆరోగ్య శ్రీకి సంబంధించినవే వేస్తున్నారు. దీంతో రెండు రకాలుగా పేద రోగులు నష్టపోతున్నారు. సర్జరీ, ఆపరేషన్ల రూముల్లోకి ఎవరికీ అనుమతి ఉండదు. పైగా శరీరంలో కనిపించకుండా వేసే రాడ్స్, స్టెంట్లు ఏవివేశారో గుర్తించే వీలుండదు. దీంతో ఇదే అదునుగా తీసుకుని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్​ పేద రోగుల నుంచి కోట్ల రూపాయలుదండుకుంటున్నాయి. 

రేట్లు పెంచినా మారని తీరు 

ఆరోగ్య శ్రీ కింద కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయిలో పేదలకు ఉచితంగా అందించే ఆరోగ్య శ్రీ సేవల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో పాటు 163 కొత్త చికిత్సలను యాడ్ చేసింది. ప్రస్తుతం కొత్తగా చేర్చిన చికిత్సలతో కలిపి మొత్తం 1,835 చికిత్సలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల దాకా ఉచిత వైద్యం అందిస్తున్నది. ఇందులో 1,300కు పైగా ప్రొసీజర్లకు 20 నుంచి 20 శాతం రేట్లు పెంచింది. దీంతో ప్రభుత్వంపై ఏటా రూ.600 కోట్ల దాకా అదనపు భారం పడుతున్నది. అయినా ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు మార్చుకోవడం లేదు. 

కంప్లయింట్ బాక్స్​లు లేవు.. పర్యవేక్షణ కరువు

ఆరోగ్య శ్రీ పేరిట ప్రైవేట్ హాస్పిటల్స్ బహిరంగంగా జరుగుతున్న ఈ దోపిడీపై ఫిర్యాదు చేసేందుకు కంప్లయింట్ సిస్టమ్ కూడా లేదు. ఆయా హాస్పిటల్స్​లో కంప్లయింట్ బాక్స్​లు కూడా ఏర్పాటు చేయడం లేదు. ప్రభుత్వం తరఫు నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్​లో జరుగుతున్న ఆరోగ్య శ్రీ చికిత్సలపై మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా లేదు. ఇదే అదునుగా  పేదలనుంచి  ప్రైవేట్​ హాస్పిటల్స్ అందినకాడికి దోచుకుంటున్నాయి. అందుబాటులో ఉండే ఆరోగ్య మిత్రలు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని, ఆరోగ్య శ్రీ హాస్పిటల్స్​లో  డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డి.శ్రావణ్​కు రోడ్డు యాక్సిడెంట్​లో తుంటి ఎముక విరిగింది. బోడుప్పల్ దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్​లో చేరాడు. సర్జరీ చేసి.. రాడ్ వేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. శ్రావణ్​కు ఆరోగ్య శ్రీ కార్డు ఉంది. దీంతో అందులోనే ట్రీట్​మెంట్​​ చేయాలని కోరాడు. ఆరోగ్య శ్రీ కింద అడ్మిట్ చేసుకొని.. సర్జరీకి అప్రూవల్ తీసుకున్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం.. ప్రభుత్వం నుంచి వచ్చే రాడ్​ సెకండ్ క్వాలిటీ ఉంటుందని చెప్పారు. తాము క్వాలిటీ రాడ్ వేస్తామని.. ఇందుకు అన్నీ కలిపి అదనంగా రూ.40 వేలు ఖర్చు అవుతుందని క్యాష్ అడిగారు. చేసేదేమీ లేక.. మధ్యలో వెళ్లలేక శ్రావణ్​ కుటుంబ సభ్యులు అడిగినంత ఇచ్చుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జీవన్ రోజు కూలీ. అతడికి సడెన్​గా హార్ట్ అటాక్ వచ్చింది. అక్కడినుంచి వచ్చి  హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో అడ్మిట్​ అయ్యాడు. ఆరోగ్య శ్రీ కింద ట్రీట్​మెంట్​ చేయాలని.. కుటుంబ సభ్యులు అతడి కార్డు వివరాలు ఇచ్చారు. సింగిల్ స్టెంట్ వేయడానికి ముందు డాక్టర్లతో ఆస్పత్రి యాజమాన్యం పేషెంట్ వైపు వాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పించింది. నాణ్యమైన స్టెంట్ వేస్తామని అందుకు కనీసం రూ.50 వేలు అదనంగా ఖర్చవుతుందని  చెప్పారు. ఆ మొత్తం నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. గుండెకు సంబంధించినది కావడంతో వారి మాటలకు భయపడి అడిగినంత ఇచ్చుకున్నారు.