బైకును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ఇద్దరు వలస కార్మికులు మృతి

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం(ఆగస్టు 21) ఉదయం వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం స్టేజి వద్ద గుంటూరు నుంచి హైదరాబాద్‌  వెళ్తున్న ప్రైవేటు బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అదుపుతప్పిన బస్సు.. బైకును ఢీకొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు.

బస్సు బురద పొలంలో కూరుకుపోయింది. దీంతో బస్సు ప్రయాణికులు కష్టంగా బయటకు వచ్చారు. క్రేను సహాయంతో బస్సును బయటకు తీశారు. మృతులను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.