
ఆంధ్ర ప్రదేశ్: నిబంధనలకు విరుద్ధంగా తిరిగిన 62బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర రావు. సంక్రాంతి సందర్భంగా కొన్ని ప్రైవేట్ బస్సుల యాజమాన్యం అధిక చార్జీలను వసూలు చేస్తున్నారని చెప్పారు. అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పారు. మీడియాతో మాట్లాడిన ఆయన… సంక్రాంతి వస్తుండటంతో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్… ప్రయాణికులనుంచి అధిక చార్జీలు వసూలు చేస్తుండటంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని చెప్పారు. అటువంటి బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు 62 బస్సులను సీజ్ చేశామని చెప్పారు.
విజయవాడలో… నాలుగు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు వెంకటేశ్వరరావు. కనకదుర్గమ్మ వారధి, పొట్టిపాడు టోల్ ప్లాజా, గరికపాడు చెక్ పోస్టు, కీసర టోల్ ప్లాజా వద్ద తనిఖీలను నిర్వహించామని చెప్పారు. కనకదుర్గమ్మ వారధి వద్ద 8 కేసులు, పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద 21 కేసులు, గరికపాడు చెక్ పోస్ట్ వద్ద 7 కేసులు, కేసర టోల్ గేట్ వద్ద 26 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్దిష్టమైన ధరలకు టికెట్ల అమ్మకాలు జరపాలని, లేకుంటే చర్యలు తప్పవని వెంకటేశ్వరరావు చెప్పారు.