ఇంటర్ పరీక్షలకు సెంటర్లు ఇవ్వం ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం

ఇంటర్ పరీక్షలకు సెంటర్లు ఇవ్వం ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం
  • ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం ప్రకటన 

హైదరాబాద్,వెలుగు: ఇంటర్మీడియేట్ బోర్డు, ప్రైవేటు కాలేజీల మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. వచ్చేనెల 3 నుంచి ప్రారంభంకానున్న  ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో సీసీకెమెరాలు పెట్టాలనే నిబంధనను అమలు చేయబోమని ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం ప్రకటించింది. 

టైమ్ ఇవ్వకుండా తమపై ఒత్తిడి చేయడం తగదని చెప్పింది.  ఇదే విషయమై గురువారం అన్ని జిల్లాల డీఐఈఓలకు నోటీసులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. బుధవారం హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రైవేటు జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ సమావేశమైంది. 

ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్ మాట్లాడారు. ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో సీసీకెమెరాలు పెట్టాలని లేకుంటే పరీక్షా కేంద్రాలు ఇవ్వబోమని ఇంటర్ బోర్డు షరతు పెట్టిందని గుర్తుచేశారు. మూడేండ్లుగా స్కాలర్ షిప్​లు అందడం లేదని, అప్పులతో కాలేజీలను నడిస్తున్నామని తెలిపారు. 

ఇలాంటి సమయంలో సీసీకెమెరాల ఏర్పాటు తమకు ఆర్థిక భారంగా మారిందని వెల్లడించారు. వాటిని ఏర్పాటు చేసుకునేందుకు సమయం కూడా ఇవ్వకుండా బోర్డు సెక్రటరీ బ్లాక్ బెయిల్ చేసినట్టుగా వ్యవహరించడం సరికాదన్నారు. 

బోర్డు పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వబోమనేది పక్కన పెడితే.. తామే పరీక్షా కేంద్రాలకు సెంటర్లను ఇవ్వొద్దని నిర్ణయించినట్టు చెప్పారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తీరుతో సర్కారుకూ చెడ్డపేరు వస్తున్నదని ఆరోపించారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ బాధ్యత  నుంచి  ఆయనను తప్పించాలని గౌరీ సతీశ్ డిమాండ్ చేశారు.