సీరియస్ అయితే గెంటేస్తున్నారు!
ఉన్నన్ని రోజులు దండుకుంటున్నారు
సీరియస్ అయితే హైదరాబాద్ కు రెఫర్ చేస్తున్నరు
చిత్తు కాగితాలపై బిల్లులు రాసిస్తున్నరు
ఇప్పటికే జడ్పీ వైస్ చైర్మన్, ఓ సర్పంచ్ మృతి
ఆదిలాబాద్, వెలుగు: ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లో వైద్యం బాగుంటుందని వెళ్తున్న రోగులకు చేదు అనుభవమే ఎదురవుతోంది. రూ.లక్షల్లో బిల్లులు గుంజి, ప్రాణాలమీదికి వచ్చాకా చేతులెత్తేస్తున్నారు. మరోవైపు చిత్తుకాగితాలపై బిల్లులు రాసిచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న, తలమడుగు మండలానికి చెందిన సర్పంచ్ పెందూర్ లక్ష్మణ్ కరోనా బారిన పడి ఆదిలాబాద్ శివారులోని ఓ కోవిడ్ కేర్ సెంటర్ లో చేరారు. రెండుమూడు రోజులు ట్రీట్‌మెంట్‌చేసి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు పంపించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతోనే అక్కడికి వెళ్లిన వారి కండీషన్ సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కావడంతో కరోనాతో భయపడేవారందరూ ఇక్కడికే వస్తున్నారు. వారినుంచి ప్రతిరోజు రూ. 30 వేలు మినిమమ్ బిల్ తీసుకుని కేవలం కశాయాలు, పారాసిటమల్, సిట్రిజిన్ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. తెల్లకాగితాలపై బిల్లులు రాసి ఇస్తున్నారు. సిబ్బంది అక్కడ పనిచేసే స్వీపర్లు, ఇతర ఉద్యోగుల గూగుల్ పేలో డబ్బులు తీసుకుంటున్నారని, కండీషన్ సీరియస్ అయితే అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారని చెబుతున్నారు. దానికీ రూ. 35 వేల వరకు వసూలు చేసినట్లు పేషెంట్ల బంధువులు పేర్కొంటున్నారు.
డబ్బు సంపాదనే లక్ష్యంగా..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇదివరకే నాలుగు కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా బెడ్లు ఖాళీగానే ఉంటున్నాయి. అయినప్పటికీ ఆఫీసర్లు మరో ప్రైవేట్సెంటర్కు పర్మిషన్ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ క్వారంటైన్ పీరియడ్మొత్తం ఉంటే రూ. 5 నుంచి రూ. 8 లక్షల బిల్లు వేస్తున్నట్లు కొందరు బాధితులు ఆరోపించారు. ఆదిలాబాద్ శివారులోని రాంపూర్ వద్ద గల ఓపాకలో నడిపిస్తున్న ఈ సెంటర్‌కు కనీసం వెళ్లడానికి కనీసం సరైనా మార్గం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రిమ్స్‌లోనే ఖాళీగా ఉంటున్నాయి..
ఆదిలాబాద్ లోని మైనారిటీ బాయ్స్‌హాస్టల్, పోస్ట్ మెట్రిక్ మైనారిటీ హాస్టల్, యూత్ ట్రైనింగ్ సెంటర్లలో కోవిడ్‌కేర్ సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలోనే చాలావరకు బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. 340 బెడ్లు ఉన్న రిమ్స్ కోవిడ్ కేర్ సెంటర్లో ఎప్పుడూ బెడ్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఉట్నూర్‌లో మరో కోవిడ్ కేర్ఉంది. వీటిని కాదని ఆఫీసర్లు రాంపూర్ రోడ్డు వద్ద కొత్తగా మరో ప్రైవేటు సెంటర్‌కు అనుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎక్కువ ఫీజులు తీసుకోవడం తప్పు
ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తు న్నారనే విషయం మాదాకా వచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీని వేశాం. ఆ కమిటీద్వారా ఎంక్వైరీ చేయించి చర్యలు తీసుకుంటాం. ఏ చికిత్సకు ఎంత తీసుకుం రనే విషయం స్పష్టంగా డిస్ ప్లే చేయించి, పక్కా బిల్లులు ఇచ్చేలా చూస్తాం. –డాక్టర్ నరేందర్ రాథోడ్, డీఎంఅండ్‌హెచ్‌వో.