- రూ.3.50 లక్షలు కడితే పది బర్రెలు ఇస్తామంటూ మోసం
మంచిర్యాల, వెలుగు: ‘మీరు మూడున్నర లక్షలు కడితే చాలు. మేం ఆరున్నర లక్షలు లోన్ ఇస్తం. మొత్తం పది లక్షలతోటి పది బర్రెలను కొనిస్తం. పాలు మేమే కొంటం. మార్కెట్ రేటు కంటే రెండు రూపాయలు ఎక్కువే ఇస్తం. ఆ పైసల్లోంచి నెలనెలా లోన్ కిస్తీలు కట్ చేసుకుంటం’ అంటూ ఓ ప్రైవేట్ డెయిరీ నిర్వాహకులు పాడి రైతులను మోసం చేస్తున్నారు. రాష్ర్టంలోని పలు జిల్లాల్లో అరిజిన్ డెయిరీ పేరిట బ్రాంచీలు తెరిచి పశుమిత్రలను డైరెక్టర్లుగా, ఏజెంట్లుగా పెట్టుకొని భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా ఒక్క మంచిర్యాల జిల్లాలోనే పాడి రైతుల నుంచి రూ. కోటిన్నరకు పైగా దండుకున్నట్టు తెలిసింది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కాగా, అరిజిన్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదినారాయణను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ ఎడ్ల మహేశ్ చెప్పారు. రూ.కోటిన్నరకు పైగా నగదు వరకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ఒక్క బీఎంసీ కూడా లేకుండానే....
మిల్క్ డెయిరీని నెలకొల్పాలంటే కోట్ల రూపాయల పెట్టుబడి, భారీ యంత్రాంగంతో పాటు నిర్వహణ వ్యవస్థ అవసరమవుతుంది. కానీ అరిజిన్ డెయిరీకి ఇప్పటివరకు ఒక్క బీఎంసీయూ (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్) కాదు కదా.. కనీసం మిల్క్ కలెక్షన్ సెంటర్ కూడా లేదు. ఇవేమీ లేకుండానే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, నల్గొండ జిల్లాల్లో కార్యకలాపాలు స్టార్ట్ చేసింది. ఒక్కో బర్రెకు రూ.708 చొప్పున వసూలు చేస్తూ పాడి రైతులను మెంబర్లుగా చేర్చుకుంటోంది. బర్రె సహజంగా చనిపోతే రూ.5వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే దాని విలువలో 80 శాతం (గరిష్టంగా రూ.50వేలు) నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి రైతులను బురిడీ కొట్టిస్తోంది. రైతులు తమ వాటాగా రూ.3.50 లక్షలు చెల్లిస్తే డెయిరీ తరపున రూ.6.50 లక్షలు లోన్ ఇచ్చి రూ.10 లక్షలతో పది పాడి బర్రెలను ఇస్తామని, మార్కెట్ ధర కంటే రూ.2 ఎక్కువ ఇచ్చి కొంటామని రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు.
పశుమిత్రలే డైరెక్లర్లు, ఏజెంట్లు...
గ్రామాల్లో పాడి రైతులకు సేవలందిస్తున్న పశుమిత్రలకు రూ.వేలల్లో జీతాలు, ఇన్సెంటివ్‌లు ఆశచూపి బుట్టలో వేసుకున్నారు. వారితో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా చేర్చుకున్నారు. నెలకు రూ.లక్ష జీతం ఇస్తామని చెప్పడంతో మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని వెటర్నరీ హాస్పిటల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ అటెండర్ ఒకరు జాబ్‌కు రిజైన్ చేసి ఈ డెయిరీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరాడు. ఇలాగే మరో నలుగురైదుగురు డైరెక్టర్లుగా, మేనేజర్లుగా చేరగా... చాలామంది పశుమిత్రలు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.
ప్రజాప్రతిధులు, అధికారుల పేర్లు వాడుకొని...
అరిజిన్ డెయిరీ నిర్వాహకులు వివిధ జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారుల పేర్లు వాడుకుంటూ పాడి రైతులను బోల్తా కొట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిరుడు ఆగస్టులో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఎంసీయూ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరు కాగా, అప్పటి యానిమల్ హజ్బెండరీ జాయింట్ డైరెక్టర్ శంకర్ పాల్గొన్నారు. వారు ఓ రైతుకు పాడి గేదెల యూనిట్‌ను అందజేశారు. అలాగే హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ ఓ రైతుకు నష్టపరిహారం చెక్కు అందించగా అది బౌన్స్ అయ్యింది. ఫ్లెక్సీల్లో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్‌తో పాటు ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల ఫొటోలను ముద్రించారు. తమ డెయిరీలో కొంతమంది ప్రజాప్రతినిధులు పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్తూ పాడి రైతులను నమ్మించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి.
దళితబంధు లబ్ధిదారులే టార్గెట్..
రాష్ర్ట ప్రభుత్వం దళితబంధు స్కీం ద్వారా డెయిరీ యూనిట్లను ప్రోత్సహిస్తుండడంతో అరిజిన్ డెయిరీ నిర్వాహకులు ఈ పథకం లబ్దిదారులపై కన్నేసినట్టు సమాచారం. దళితబంధులో కీలకంగా మారిన ప్రజాప్రతినిధులకు పెద్ద మొత్తంలో కమీషన్ల ఆశచూపి డెయిరీ యూనిట్ పెట్టుకోవాలనుకునే లబ్ధిదారులకు బర్రెలను సప్లై చేసే చాన్స్ కొట్టేసినట్టు తెలిసింది. మార్కెట్లో ఒక్కో మేలుజాతి బర్రెకు రూ.70 వేల వరకు రేటు పలుకుతుండగా, వీరు మాత్రం రూ.లక్ష రేటు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రభుత్వం త్వరలోనే ఒక్కో నియోజకవర్గానికి 500 దళితబంధు యూనిట్లను శాంక్షన్ చేయనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీలైనంత దండుకోవడానికి ప్లాన్ వేసినట్టు తెలిసింది.
ఇవీ ఫిర్యాదులు...
- నెన్నెల మండలం జెండ వెంకటాపూర్‌కు చెందిన గుర్గం రాజంను నెలకు రూ.13వేల జీతానికి సూపర్వైజర్గా నియమించుకున్నారు. జీతం ఇవ్వడం లేదని, అడిగితే చంపుతామంటున్నారని ఈ నెల 11న నెన్నెల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
- కాసిపేట మండల కేంద్రానికి చెందిన సింగరేణి కార్మికుడు నలిగేటి రాజేందర్ తనకు రూ.10 లక్షలకు 10 బర్రెలు ఇస్తామని రూ.2లక్షలు తీసుకుని మోసం చేశారని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. బెల్లంపల్లి గాంధీనగర్‌కు చెందిన శివచక్రవర్తి తన వద్ద రూ.70వేలు తీసుకున్నారని కంప్లయింట్ ఇచ్చాడు.
- తాండూర్ మండలం గజ్జెలపల్లికి చెందిన మొగిలి మల్లేశ్‌కు ఐదు బర్రెలు ఇస్తామని రూ.1,75,000 వసూలు చేశారని, బర్రెలు ఇవ్వకపోగా, పైసలు అడిగితే బెదిరిస్తున్నారని కంప్లయింట్ చేశాడు.
- తాండూర్‌కు చెందిన చౌటపల్లి హరిప్రియ రూ.8.50 లక్షలు చెల్లిస్తే ఎనిమిది బర్రెలు, రెండు ఆవులు ఇచ్చారని, ఇంకా పైసలు డిమాండ్ చేస్తున్నారని, అగ్రిమెంట్ ప్రకారం పాలు కొనడం లేదని కంప్లయింట్ చేశారు. దీంతో పోలీసులు డెయిరీ ఎండీతో పాటు డైరెక్టర్లు, మేనేజర్లు నలుగురిపై కేసులు నమోదు చేశారు.