వీడియోస్ లైక్స్ పేరుతో టోకరా..క్షణాల్లో అకౌంట్ నుంచి రూ.20లక్షలు మాయం

వీడియోస్ లైక్స్ పేరుతో టోకరా..క్షణాల్లో అకౌంట్ నుంచి రూ.20లక్షలు మాయం
  • ప్రైవేటు ఉద్యోగి నుంచి  రూ.20లక్షలు లాగిన సైబర్ నేరగాళ్లు

బషీర్ బాగ్ ,వెలుగు : ఇన్​స్టాగ్రామ్​ వీడియోస్ లైక్స్ పేరిట ఓ ప్రైవేట్​ ఉద్యోగిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తికి ఫ్రెషర్ వరల్డ్ కంపెనీ పేరుతో స్కామర్లు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించారు.

 ఇన్​స్టాగ్రామ్​ లోని వీడియోస్ కి లైక్స్ కొట్టి , వాటి స్క్రీన్ షాట్స్ ను తమకు పంపితే , ఒకొక్క లైక్ కు 150 రూపాయలను చెల్లిస్తామని... ఇంట్లోనే ఉంటూ రోజుకు 4 వేల నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చునని నమ్మించారు. 

దీనితో బాధిత వ్యక్తి స్కామర్స్ పంపిన టెలిగ్రామ్ లింక్ ద్వారా వర్క్ ఫర్ హోమ్ లో జాయిన్ అయ్యాడు. మొదట కొంత మేర లాభాలను స్కామర్లు చెల్లించారు. అనంతరం అధిక లాభాలు కోసం క్రిప్టో కరెన్సీ లో ఇన్వెస్ట్​మెంట్​ చెయ్యాలని సూచించారు. 

దీంతో అతను అలాగే చేశాడు. ఆ డబ్బులు తప్పుగా ఇన్వెస్ట్ చేశావని స్కామర్లు తెలిపారు. అనంతరం ఓ లింక్ ను పంపి , అతడు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులను చూపించారు. ఆ డబ్బులు రిఫండ్ కావాలంటే మరి కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒత్తిడి చేశారు.

దీనితో మోసపోయానని గ్రహించిన బాధితుడు తాను రూ 20,35,000 పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.