బషీర్ బాగ్, వెలుగు: మనీల్యాండరింగ్ కేసులో చిక్కుకున్నారని, సుప్రీం కోర్టు ఈ కేసులో మరణ శిక్ష విధించే అవకాశం ఉందని బెదిరించి ఓ ప్రైవేటు ఉద్యోగం చేసున్న మహిళ నుంచి రూ. 43.4 లక్షల డబ్బు లాగిన ఘటనలో సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన 36 ఏళ్ల మహిళా ప్రైవేట్ ఉద్యోగికి కొన్ని రోజుల క్రితం సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఇల్లీగల్ యాడ్స్, వేధింపుల మెసేజ్‌లు పంపుతున్నారని ముంబైలో కేసు నమోదు అయిందని చెప్పారు.
ట్రాయ్ ఆమె నంబర్‌ను బ్లాక్ చేయకుండా ఉండాలన్నా, కేసు నుంచి బయటపడాలన్నా తాము చెప్పినట్టు చేయాలన్నారు. ఆమెను భయపట్టేందుకు ఫేక్ ఎఫ్ఐఆర్లు, అరెస్ట్ వారెంట్లు పంపారు. దీంతో పాటు మనీల్యాండరింగ్ కేసు కూడా నమోదైందని, సుప్రీంకోర్టు, ఆర్‌బీఐ లేఖలు అని చూపించారు. మరణశిక్ష విధించే అవకాశం ఉందని భయపెట్టారు. ఈ కేసు నుంచి భయటపడాలంటే ఆర్‌బీఐకి డబ్బులు ఇవ్వాలని, ఫేక్ కోర్టు లింక్ పంపి బాధితురాలని నమ్మించారు. ఇలా వరుసగా ఆమెను బెదిరించసాగారు. దీంతో ఆమె తాను దాచుకున్న ఎఫ్డీ డబ్బులను కూడా డ్రా చేసి సుమారు రూ.43,40,000 స్కామర్లకు పంపింది. చివరికి మోసపోయానని గ్రహించి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.