సర్కారు నిర్లక్ష్యం వల్లే ప్రైవేటు ఫీ‘జులుం’

హైదరాబాద్​లోని అంబర్ పేట నారాయణ కాలేజీలో ఫీజు కట్టకుండా టీసీ ఇవ్వడం లేదని ఓ స్టూడెంట్​ప్రిన్సిపల్ రూంలో పెట్రోల్ పోసుకోగా నిప్పంటుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఒక్క ఘటన రాష్ట్రంలో ఫీజుల విధానం, ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ వైఖరిని తెలుపుతోంది. ప్రైవేటులో ఫీజుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుండగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ అధ్వాన స్థితిలో ఉంది. సర్కారు బడుల్లో సౌలత్​లు లేవు, సార్లు లేరు, పూర్తి స్థాయిలో పుస్తకాలు రాలేదు, యూనిఫామ్​అందలేదు, మధ్యాహ్న భోజనం అంతంతే. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గురుకులాల్లో ఫుడ్​పాయిజన్​అయి స్టూడెంట్స్​అస్వస్థతకు గురయ్యారు. ఇలా ప్రభుత్వంలో జవాబుదారీతనం లేకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో తల్లిదండ్రులు ప్రైవేటు బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. లాభాపేక్ష లేని సంస్థలుగా కేవలం సేవా కార్యక్రమంలో భాగంగానే ప్రైవేటు బడులకు చట్టరీత్యా ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి.  రాజ్యాంగం ప్రకారం విద్యను వ్యాపార సరుకుగా చూడడానికి వీలులేదు. కానీ ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న ప్రైవేటు స్కూళ్లు, ఇష్టారాజ్యంగా రూ. వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. 

సౌలత్​లు, సామర్థ్యాలు లేకున్నా..

తెలంగాణ విద్యా శాఖ విడుదల చేసిన 2019–-20 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 41,220 బడుల్లో 10,985(26.6%) ప్రైవేటు స్కూల్స్​ఉన్నాయి. మొత్తం 62 లక్షల మంది విద్యార్థులు ఉంటే, వారిలో 35 లక్షల మంది (దాదాపు 56 శాతం) ప్రైవేటు బడుల్లో చదువుతున్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 9 లక్షల30 వేల మంది బడికి వెళ్తున్న పిల్లల్లో 7 లక్షల 50 వేల మంది ప్రైవేటు బడుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఎంతో కష్టపడి ఫీజులు, ఇతర సామగ్రికి డబ్బు వెచ్చించి ప్రైవేటు బడుల్లో చదివిస్తున్నా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మరి బాగున్నాయా? అంటే అదీ లేదు. ప్రభుత్వ బడుల కన్నా ఏ మాత్రం మెరుగ్గా లేవని ఈ మధ్య విడుదలైన జాతీయ స్థాయి నేషనల్ అచీవ్ మెంట్ సర్వే నివేదిక తేటతెల్లం చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం బడిలో ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్, గాలి, వెలుతురు వచ్చే తరగతి గదులు, ప్రహరీ, ఆట స్థలం, టాయిలెట్స్, నీటి వసతి ఉండాలి. కానీ రాష్ట్రంలోని మెజార్టీ ప్రైవేట్ బడుల్లో ఈ సౌలత్​లు లేవని పలు నివేదికలు బయట పెట్టాయి. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రైవేటు విద్యా సంస్థలను ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం ఏమీ అనడం లేదు.

ప్రత్యేక చట్టం తేవాలి

గత కొన్నేండ్లుగా ప్రైవేటు విద్యా సంస్థలు తమ ఇష్టానుసారంగా ఫీజుల పెంచడంపై తల్లిదండ్రులు సంఘాలుగా లేదా వ్యక్తిగతంగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. వాటికి స్పందనగా 2017 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఓయూ మాజీ వీసీ తిరుపతి రావ్ నేతృత్వంలో ఫీజుల నియంత్రణపై తగిన సూచనల కోసం ఒక కమిటీ వేసింది. జనవరి 2018లో కమిటీ తన నివేదికను సమర్పించింది. ఆ నివేదిక తల్లిదండ్రులకు ఏ మాత్రం ఉపశమనం కలిగించలేదు. ప్రైవేటు విద్యా సంస్థల అధిపతులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా చట్ట సభల్లోకి వెళ్తున్న తరుణంలో కొత్త విధి విధానాలను యాజమాన్యాలకు అనుకూలంగా కాకుండా విద్యార్థులకు అనుకూలంగా చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో పేద మధ్య తరగతికి చెందిన లక్షలాది కుటుంబాలు ప్రైవేటు బడుల్లో అధిక ఫీజుల దోపిడీకి గురవుతున్నారు. వారి ఆదాయంలో అత్యధిక శాతం పిల్లల విద్యకే ఖర్చు చేస్తున్నారు. ఈ దుస్థితి నుంచి బయట పడడానికి ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలి. నిరంతరం పర్యవేక్షణకు స్వయం ప్రతిపత్తి గల కమిషన్ ఏర్పాటు చేయాలి.  విద్యకు నిధుల కేటాయింపు పెంచి విద్యారంగాన్ని బలోపేతం చేయాలి.

ఎడ్యుకేషన్​పాలసీ ఏది?

లిక్కర్, ఇండస్ట్రియల్, సాగు నీటి పాలసీ, మౌలిక వసతుల అభివృద్ధి పాలసీ, స్మార్ట్ సిటీ వంటి పాలసీలను పోటీపడి ఎప్పటికప్పుడు సమీక్ష  చేసే ప్రభుత్వం, ప్రైవేట్ విద్యా వ్యవస్థ విధానంపై మాత్రం39 ఏళ్ల కింద చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం1982తోనే సరిపెడుతోంది. కరోనా సమయంలో 2020 ఏప్రిల్ లో విడుదల చేసిన జీవో నెం 46 కూడా1993లో రూపొందించిన నియమాలలోని రూల్21 ప్రకారం విడుదల చేసిందే కావడం గమనార్హం. కొత్త విధానం రూపొందించకపోగా, కనీసం పాత  చట్టం అమలుపై కూడా చిత్తశుద్ధి లోపించడం బాధాకరం. ఈ చట్టంలోని నియమాల ప్రకారం ప్రవేశ రుసుం ఉండకూడదు. పాఠశాల యాజమాన్యాలు 5% శాతం కంటే ఎక్కువ లాభాలు తీసుకోకూడదు. వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతం టీచర్లకు జీతాలుగా ఇవ్వాలి.  మరో15 శాతం ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగించాలి. అప్లికేషన్ ఫీజు రూ.100, రిజిష్ట్రేషన్ ఫీజు రూ.500, డిపాజిట్ రూ.5000 మాత్రమే తీసుకోవాలి. ఇవి తప్ప మరే రకమైన పేర్లతో కూడా డబ్బులు వసూలు చేయకూడదు. స్కూల్స్​నోటుపుస్తకాలు, బట్టలు అమ్మొద్దు. ఇన్ని నియమాలు ఉన్నా , వాటి అమలుకు ప్రభుత్వ యంత్రాంగం గానీ, ప్రజా ప్రతినిధులు గానీ ఏ మాత్రం శ్రద్ధ పెట్టడంలేదని ఇప్పుడున్న దుస్థితి తెలుపుతోంది. 

- ఆర్. వెంకట రెడ్డి, 
జాతీయ కన్వీనర్, 
ఎం.వి.ఫౌండేషన్