తయారవుతున్నాయ్ ప్రైవేట్​ అడవులు

పొట్ట చేతబట్టుకుని పట్టణాలు, నగరాలకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.  పట్టణాలు శివారు ప్రాంతాల్లోకి కూడా విస్తరిస్తున్నాయి. అప్పటివరకు రోడ్డుకు అటూ ఇటూ గుబురుగా కనిపించే చెట్లు కనిపించకుండా పోతున్నాయి. పచ్చదనం స్థానంలో కాంక్రీట్​ జంగిల్​ తయారవుతోంది.. దీనివల్ల అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. చెట్లు ఉంటేనే వానలు పడతాయి. పంటలు పండుతాయి. దేశంలో కరవు అనేది ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో  ప్రైవేటు అడవుల అంశం తెర మీదకు వచ్చింది. అడవుల పెంచడానికి గ్రీనరీ లవర్స్​ ముందుకు వస్తున్నారు. ఏదో ఒక యాజమాన్యంలో అడవులను పెంచితే ప్రకృతిపరంగా వచ్చే నష్టాలకు చెక్ పెట్టవచ్చంటున్నారు.

రాచరికపు రోజుల్లో ప్రైవేటు ఫారెస్టులు

మన దేశంలో  ప్రైవేటు అడవుల కాన్సెప్ట్ ఎప్పట్నుంచో ఉన్నదే. వందల ఏళ్ల కిందట రాజ వంశాలకు చెందినవారు సొంతంగా వనాల పేరుతో కొన్ని ఎకరాల్లో రకరకాల చెట్లు జాతులను పెంచేవారు.  రాజ కుటుంబాల ఆహార అవసరాలకోసం ఈ వనాల్లో కూరగాయలను అప్పటి రోజుల్లో పండించేవారు. దేశానికి స్వతంత్రం వచ్చాక ఇలాంటి వనాలను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వీటిని నేషనల్ పార్కులుగా,  శాంక్చురీస్​గా మార్చేసింది. మళ్లీ ఇన్నేళ్లకు ప్రైవేటు అడవుల కాన్సెప్ట్ మొదలైంది. చెట్లను ప్రేమించేవాళ్లు ఒక గ్రూపుగా ఏర్పడి సొంతంగా అడవులను పెంచడం మొదలెట్టారు. సహజంగా ఈ గ్రూపులో పాతికమంది వరకు ఉంటారు. ఓ సంస్థగా ఏర్పడి నగరాలకు దూరంగా కొన్ని ఎకరాల భూమిని  కొని,  అడవిగా డెవలప్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, లాభాలను ఆశించని కొన్ని  సంస్థలు ఇలా ప్రైవేటు అడవుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నాయి.

అన్ని దేశాల్లో ఉన్నదే

ప్రైవేటు ఫారెస్ట్ కాన్సెప్ట్ అన్ని దేశాల్లో ఉన్నదే. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న అడవులతో పోలిస్తే ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో అడవులను పెంచడం ఈజీ అంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రైవేటు అడవులు తక్కువ విస్తీర్ణంలో ఉంటాయి. సాధారంగా 30 నుంచి 60 ఎకరాలలోపే ఉంటాయి. ఏరియా తక్కువ కావడంతో  ఎప్పటికప్పుడు అడవిలో పరిస్థితిని, చెట్ల పెంపకాన్ని సూపర్​వైజ్ చేయడం ఈజీ అవుతుంది. ఏ చెట్టుకు నీరందుతుందో, ఏ మొక్కకు చీడపీడలు పట్టాయో వెంటవెంటనే తెలుసుకునే వీలు కలుగుతుంది. చెట్ల ద్వారా వచ్చే రాబడి కంటే  పచ్చదనాన్ని కాపాడుతున్నామన్న  ఫీలింగ్ పెంచేవారికి ఆనందాన్నిస్తుంది.

మియావాకి పద్ధతి అంటే …?

ప్రైవేటు అడవులను ఎక్కువగా మియావాకి పద్ధతిలో పెంచుతారు. జపాన్​కు చెందిన బొటానిస్టు అకీరా మియావాకి ఈ టెక్నిక్​ని కనిపెట్టాడు. మామూలు పద్ధతితో పోలిస్తే మియావాకి టెక్నిక్​తో ఏదైనా చెట్టు పదింతలు త్వరగా పెరుగుతుంది. చాలా తక్కువ ఏరియాలో చెట్లను దట్టంగా పెంచడం ఈ టెక్నిక్​లోని  మెయిన్ పాయింట్. స్థానిక మొక్కలనే ఈ టెక్నిక్​లో ఎక్కువగా వాడుకుంటారు. మియావాకి టెక్నిక్​తో  మొక్కలను పెంచడానికి డబ్బు కూడా పెద్దగా ఖర్చు కాదంటున్నారు బొటానిస్టులు. చాలా తక్కువ జాగాల్లో ఈ టెక్నిక్​తో అడవులను పెంచవచ్చు. మియావాకి టెక్నిక్​ని మనదేశంలో ఎంటర్​ప్రెన్యూర్ శుభేందు శర్మ  బాగా ప్రచారంలోకి తెచ్చారు. 2008లో టోక్యోలో అకీరా మియావాకితో కలిసి శుభేందు పనిచేశారు. ఈ టెక్నిక్​తో మొక్కలను పెంచితే రాబడి ఎంత ఎక్కువగా వస్తుందో ఆయన స్వయంగా గమనించారు. ఇండియా తిరిగొచ్చాక ఉత్తరాఖండ్​లోని తన ఇంటి వెనక ఉన్న ఖాళీ జాగాలో మియావాకి టెక్నిక్​తో  కొన్ని చెట్లను  పెంచడం మొదలెట్టాడు. ప్రస్తుతం 37 ఎకరాల్లో విస్తరించింది. ఏళ్లు గడిచేకొద్దీ చెట్లపై వచ్చే రాబడి పెరగడంతో 2011లో  తనదంటూ సొంతంగా ‘ఎఫారెస్ట్’ పేరుతో ఓ స్టార్టప్ కంపెనీ కూడా మొదలెట్టాడు. మొత్తం 138 ప్రైవేటు అడవులకు ఈ కంపెనీ సేవలందిస్తోంది. ప్రైవేటు  అడవులను పెంచాలనుకునే వారికి ‘ఎఫారెస్ట్’ స్టార్టప్ కంపెనీ  వర్క్​ షాప్ కూడా నిర్వహిస్తోంది. అడవులు పెంచడంలో గైడ్ లైన్స్ ఇస్తోంది.