
నిజామాబాద్, లక్నవరం, పెంబర్తి రెస్టారెంట్ల నిర్వహణకు టెండర్లు
బుద్ధవనంలో రెస్టారెంట్, కాటేజీలూ ప్రైవేట్ వ్యక్తులకే
ఐదేండ్లపాటు లీజుకు ఇవ్వనున్న రాష్ట్ర సర్కారు
హైదరాబాద్ : రాష్ట్రంలో టూరిజం డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న మరో 3 రెస్టారెంట్లను, ఒక ఫుడ్ కోర్టును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్(టీఎస్టీడీసీ) సిద్ధమైంది. నిజామాబాద్‌లోని హరిత ఇందూరు, ములుగు జిల్లా లక్నవరం, జనగామ జిల్లా పెంబర్తిలోని హరిత రెస్టారెంట్ల నిర్వహణకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి టెండర్లు ఆహ్వానిస్తూ సర్కారు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటితో పాటు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని బుద్ధవనంలో ఫుడ్ కోర్టు, 40 మంది కూర్చునే కెపాసిటీ గల నాన్ ఏసీ రెస్టారెంట్, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతున్నారు. 2 బాంక్వెట్ హాల్స్, 6 కాటేజీలు, 6 కార్వాన్ల నిర్వహణకు కూడా టెండర్లు పిలిచారు. టెండర్ల ప్రపోజల్స్ స్వీకరణ డిసెంబర్ 28నే ప్రారంభం కాగా.. తుది గడువు జనవరి 12తో ముగియనుంది. టెండర్ దక్కించుకున్న వాళ్లకు ఐదేండ్లపాటు లైసెన్సింగ్ పద్ధతిలో లీజుకు ఇవ్వనున్నారు. దీంతోపాటు సిద్దిపేట కోమటి చెరువులో గేమింగ్ జోన్ నిర్వహణకు టెండర్లు పిలిచారు.
90 శాతం నిధులు కేంద్రం ఇచ్చినవే..
రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టులు స్టే చేయడానికి, ఫుడ్, ఇతర సౌకర్యాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిత హోటళ్లను నిర్మించాయి. నిధుల్లో 90 శాతం వాటా కేంద్రానిదే. కేంద్రం స్వదేశీ దర్శన్ స్కీమ్‌లో భాగంగా తెలంగాణ ట్రైబల్ సర్క్యూట్(ములుగు జిల్లా – రూ.83 కోట్లు), తెలంగాణ ఎకో టూరిజం సర్క్యూట్(మహబూబ్‌నగర్– రూ.91 కోట్లు), తెలంగాణ హెరిటేజ్ సర్క్యూట్(హైదరాబాద్– రూ.99 కోట్లు) కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52 హరిత హోటళ్లు ఉన్నాయి. ఇందులో గతంలోనే 39 హరిత హోటళ్లు ప్రైవేటుకు లీజుకు ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్నవి నేరుగా ప్రైవేటు వాళ్లకే కేటాయిస్తున్నారు. సోమశిల, లక్నవరం ప్రాంతాల్లోనూ ప్రైవేటుకే కట్టబెట్టారు. దీంతో ప్రైవేటు వాళ్లు రేట్లు ఇష్టారీతిన ఫిక్స్ చేస్తున్నారు. సాధారణ టూరిస్టులకు వసతి, భోజనం ధరలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర పర్యాటక శాఖ హోటళ్లు నిర్మిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వాటి నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి.