ముహూర్తం బాగుంది ఆపరేషన్‌‌ చేసుకో.. పంచాంగం చూసి ఒప్పిస్తున్న డాక్టర్లు

హనుమకొండ, వెలుగు :  కాన్పు కోసం ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌కు వచ్చే గర్భిణులకు ‘కోత’ తప్పడం లేదు. డబ్బులు దండుకునేందుకు అలవాటు పడిన ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ అవసరం ఉన్నా, లేకున్నా సిజేరియన్‌‌ డెలివరీలే చేస్తున్నాయి. బిల్లుల రూపంలో రూ.లక్షలు రాబట్టుకునేందుకు గర్భిణులు, వారి బంధువులకు ముహూర్తాలను సాకుగా చూపుతున్నాయి. మంచి గడియలు ఉన్నాయని, ఈ టైంలో డెలివరీ అయితే పిల్లల భవిష్యత్‌‌ బాగుంటుందని చెబుతూ బంధువులను ఒప్పిస్తూ ఆపరేషన్లు చేస్తున్నాయి. సందర్భాన్ని బట్టి ముహూర్తాన్ని వాడుకుంటుండగా, మిగతా టైమ్‌‌లలో గర్భిణికి ఏదో ఒక సమస్య ఉందంటూ భయపెట్టి ఆపరేషన్‌‌ వైప మొగ్గు చూపేలా చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌లో సిజేరియన్‌‌ డెలివరీలు ఏటికేడు పెరిగిపోతుండగా, ఆపరేషన్‌‌ చేయించుకున్న మహిళలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు.

ప్రైవేట్‌‌లో 85 శాతం సిజేరియన్లే..

ఉమ్మడి వరంగల్‌‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన గర్భిణులు ఎక్కువ శాతం డెలివరీ కోసం వరంగల్‌‌ నగరానికే వస్తుంటారు. ఇక్కడ  ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి (జీఎంహెచ్​), వరంగల్‌‌ చందా కాంతయ్య మెమోరియల్ (సీకేఎం) హాస్పిటళ్లు ఉండగా, వందల సంఖ్యలో ప్రైవేట్‌‌ హాస్పిటళ్లు వెలిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ఆర్‌‌ఎంపీలు, మెడికల్‌‌ అడ్వైజర్లు కమీషన్లకు ఆశపడి గర్భిణులను ప్రైవేట్‌‌కు రెఫర్‌‌ చేస్తున్నారు. దీంతో ప్రైవేట్‌‌ నిర్వాహకులు ఏజెంట్ల కమిషన్‌‌తో పాటు, ఇతర చార్జీలన్నీ పేషెంట్ల నుంచి వసూలు చేస్తున్నారు. గర్భిణులు, వారి బంధువులు నార్మల్‌‌ డెలివరీ వైపు ఆలోచన చేయకుండా ఏదో ఒక సాకు చెప్పి సిజేరియన్‌‌ పూర్తి చేస్తున్నాయి. ప్రైవేట్‌‌లో అడ్మిట్‌‌ అవుతున్న వారిలో సుమారు 85 శాతం మందికి ఆపరేషన్లు చేస్తుండడం గమనార్హం. దీంతోనే సీ సెక్షన్‌‌ డెలివరీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2021 నుంచి ఈ ఏడాది జులై వరకు జిల్లాలో మొత్తం 29,709 డెలివరీలు జరుగగా, ఇందులో 22,428 సిజేరియన్లే. ఇందులో ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌లో జరిగిన ఆపరేషన్లే ఎక్కువగా ఉన్నాయి.

మరో నెల కూడా కొనసాగే ఛాన్స్‌‌

జులై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణ మాసం ఉండడంతో ముహూర్తపు కాన్పులు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఇదే తీరు ఇంకో నెల వరకూ కొనసాగే అవకాశం ఉంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు నిజ శ్రావణం ఉంటుండగా ఈ నెలలోనూ పంచాంగాలు, ముహూర్తాలు చూసుకుని డెలివరీలు చేసే అవకాశం ఉంది. సిజేరియన్లు తగ్గించి నార్మల్‌‌ డెలివరీలు పెంచాలని, ప్రభుత్వం పదేపదే చెబుతున్నా ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ పట్టించుకోవడం లేదు. నార్మల్​ డెలివరీకి అవకాశం ఉన్నా... సీ సెక్షన్‌‌ చేసేసి కాసులు దండుకుంటున్నాయి. 

సర్కార్‌‌ హాస్పిటల్స్‌‌లో 60 శాతానికి పైగా...

ప్రభుత్వ హాస్పిటల్స్‌‌లోనూ సీ సెక్షన్ల రేటు అధికంగానే ఉంటోంది.  గడిచిన మూడేండ్లలో ఆ సంఖ్య కొద్దిగా తగ్గుతూ వస్తున్నా పెద్దగా మార్పు మాత్రం కనిపించడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌‌లో 2021లో 4,847 ఆపరేషన్లు జరగగా, 2022లో 4,412, ఈ ఏడాది ఏప్రిల్‌‌ నుంచి ఇప్పటివరకు 1,414 జరిగాయి. కాగా సర్కారు దవాఖానాల్లోనూ 60 శాతానికిపైగా సిజేరియన్లు జరుగుతున్నాయి.

ఆగస్టు 11, 2023 అధిక శ్రావణమాసం, శుక్రవారం మధ్యాహ్నం 12 తర్వాత మంచి ముహూర్తం స్టార్ట్‌‌ కావడంతో వరంగల్‌‌ నగరంలోని కొన్ని ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ పెద్ద ఎత్తున సిజేరియన్‌‌ డెలివరీలు చేశాయి. కొద్ది సేపు వేచి చూస్తే నార్మల్‌‌ డెలివరీ అయ్యే చాన్స్‌‌ ఉన్నా.. ముహూర్తం మంచిగుందని, అదే టైంలో డెలివరీ చేస్తే బాగుంటుందని గర్భిణుల బంధువులను ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ యాజమాన్యాలు ఒప్పించాయి. వారు కూడా ఓకే చెప్పడంతో సిటీలో శుక్రవారం ఒక్కరోజే గంట వ్యవధిలోనే ఒక్కో హాస్పిటల్‌‌లో పదుల సంఖ్యలో డెలివరీలు జరిగాయి. హనుమకొండలోని ఓ హాస్పిటల్‌‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య 11 డెలివరీలు జరగగా.. మరో హాస్పిటల్‌‌లో 10, ఇంకో హాస్పిటల్‌‌లో ఆరు డెలివరీలు జరిగాయి. ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌లో ఏటికేడు సిజేరియన్‌‌ డెలివరీల సంఖ్య పెరుగుతోంది.