వరంగల్ రూరల్, వెలుగు: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో కరోనా చావులకు అక్కడి డాక్టర్లే కారణమనే ప్రచారం తప్పని.. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో సగం సగం ట్రీట్‍మెంట్ వల్లే వారంతా మరణిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు అన్నారు. గురువారం మంత్రి ఎంజీఎం హాస్పిటల్‍ను ఆకస్మికంగా సందర్శించారు. సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డితో కలిసి అక్కడి సర్వీస్‍ల తీరును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ ట్రీట్‍మెంట్ విషయంలో జిల్లాల్లో ప్రైవేట్ హస్పిటల్స్ కంటే ఎంజీఎంలోనే బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. చాలామంది ఇది గ్రహించక ప్రైవేట్‍కు వెళుతున్నారన్నారు. హాస్పిటల్స్ మేనేజ్‍మెంట్ వారినుంచి ఫీజులు వసూలు చేసి చివర్లో తమవద్ద పూర్తి సౌకర్యాలు లేవని చెప్పడంతో.. సీరియస్ కండీషన్లో ఎంజీఎంకు తీసుకువస్తున్నారని, దీంతో వారిని కాపాడడం కష్టమవుతోందన్నారు. అలాకాకుండా కొవిడ్ పేషెంట్లు మొదట్లోనే డైరెక్ట్‌గా ఎంజీఎం వచ్చి సరైన ట్రీట్‍మెంట్ తీసుకుంటే తప్పక రికవరీ అవుతారని ధైర్యం చెప్పారు. కొవిడ్ బాధితుల కోసం ఎంజీఎంలో 800 బెడ్లు ఉండగా అందులో 650కి ఆక్సిజన్ సౌకర్యం ఉందన్నారు. ఎమర్జెన్సీ ట్రీట్‍మెంట్ కోసం వాడే రెమ్డిసివిర్ ఇంజక్షన్లను ఇంకా తెప్పిస్తున్నట్లు
పేర్కొన్నారు.
ప్రైవేట్‍పై పర్యవేక్షణకు ఐఏఎస్నియామకం
ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ ట్రీట్‍మెంట్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఎర్రబెల్లి అన్నారు. అక్కడి ఫీజులు, ఫెసిలిటీస్ మానిటరింగ్, కో ఆర్డినేషన్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‍ను నియమిస్తున్నట్లు చెప్పారు. ఎంజీఎం మానిటరింగ్‍కు డీఎంహెచ్‍వోతో పాటు డీపీవో, డీఆర్‍డీవోతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా అమెజాన్ సహకారంతో బాలవికాస స్వచ్ఛంద సంస్థ బాధ్యులు 25 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను దయాకర్ రావు సమక్షంలో ఎంజీఎం ఆఫీసర్లకు అందించారు.