కరోనా పేషంట్లకు షాక్.. కొత్త టెస్ట్ పేరుతో దోపిడీ

 

  •     ‘ఎస్‌‌‌‌–జీన్’ టెస్టు చేయిస్తున్న హాస్పిటళ్లు
  •     డయాగ్నస్టిక్ సెంటర్లతో కలిసి దందా
  •     ఒక్కో టెస్టుకు రూ.5 వేల నుంచి రూ.పది దాకా వసూలు
  •     కార్పొరేట్ కక్కుర్తిపై ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్లను దోచుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ‘వేవ్‌‌‌‌’కో ఎత్తుగడ వేస్తున్నాయి. థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌లో టెస్టుల అవసరం పెద్దగా ఉండకపోవడంతో ‘ఎస్‌‌‌‌–జీన్ టార్గెట్ ఫెయిల్యూర్’ అనే ఓ కొత్త టెస్టును తెరపైకి తీసుకొచ్చాయి. సోకింది డెల్టా వేరియంటా, ఒమిక్రాన్ వేరియంటా అనే దాన్ని బట్టి ట్రీట్‌‌‌‌మెంట్ చేస్తామని చెప్పి.. తమ వద్ద అడ్మిటైన పేషెంట్లకు ఈ టెస్టును సజెస్ట్ చేస్తున్నాయి. కొన్ని హాస్పిటళ్లు అడ్మిషన్‌‌‌‌కు ముందే ఈ టెస్టును సజెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కొన్ని పెద్ద డయాగ్నస్టిక్ సెంటర్లలోనే ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆయా సెంటర్ల యాజమాన్యాలు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఈ దందా చేస్తున్నట్టు హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఒక్కో టెస్టుకు రూ.5 వేల నుంచి రూ.పది దాకా చార్జ్ చేస్తున్నట్టుగా ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు అందాయి. 

ఏంటీ టెస్టు?
కరోనా వేరియంట్లను గుర్తించేందుకు చేసే జీనోమ్ సీక్వెన్సింగ్ ఖర్చుతో కూడుకున్నది. ఈ టెస్ట్ ప్రాసెస్ కూడా ల్యాబ్‌‌‌‌ను బట్టి ఒకట్రెండు రోజులు పడుతుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వచ్చిన కొత్తలో దీన్ని నిర్ధారించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్‌‌‌‌కు బదులు ఎస్‌‌‌‌–జీన్ టార్గెట్ ఫెయిల్యూర్ టెస్టు చేయడం ప్రారంభించాయి. శాంపిల్‌‌‌‌లో ఎస్‌‌‌‌–జీన్ లేదంటే, దాన్ని ఒమిక్రాన్‌‌‌‌గా అనుమానించి ఆయా వ్యక్తులను ఐసోలేట్ చేసేవారు. యాంటీజెన్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ తరహాలో స్పాట్‌‌‌‌లోనే ఈ టెస్ట్ రిజల్ట్ వస్తుంది. అయితే ఇది ప్రాథమిక పరీక్షే తప్ప, దీనితోనే వేరియంట్‌‌‌‌ నిర్ధారణకు రాకూడదు. ఎస్‌‌‌‌–జీన్‌‌‌‌ నెగటివ్ వచ్చినా, అది ఒమిక్రాన్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 

యాక్షన్ తీసుకుంటం
కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇవ్వడానికి వేరియంట్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ కొన్ని హాస్పిటళ్లు, ల్యాబ్‌‌‌‌లు కలిసి ఎస్‌‌‌‌–జీన్ టెస్టు కోసం పేషెంట్లను ప్రెజర్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఏయే ల్యాబ్‌‌‌‌లలో ఈ టెస్టు చేస్తున్నారో ఎంక్వైరీ చేస్తున్నాం. ఇదిలాగే కొనసాగితే కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం.
- డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్  అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్