- ఓ హాస్పిటల్‌లో నెలలోనే 88 అబార్షన్లు
- సిజేరియన్లలో రాష్ట్రంలోనే జిల్లా టాప్
- ఆఫీసర్ల తనిఖీల్లో బయటపడుతున్న బాగోతాలు
సూర్యాపేట, వెలుగు : జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా సిజేరియన్లు జరుగుతున్నాయి. నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆస్పత్రి యాజమాన్యాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గర్భిణులు కాన్పు కోసం వస్తే చాలు కాసుల కక్కుర్తితో కడుపులు కోస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసర్లు చేస్తున్న తనిఖీల్లో ఈ బాగోతాలు బయటపడుతున్నాయి. సిజేరియన్లలో రాష్ట్రంలోనే జిల్లా టాప్‌లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లా కేంద్రంలోనే ఎక్కువ..
సూర్యాపేట జిల్లాలో 49 ప్రైవేట్ఆస్పత్రులు ఉండగా.. జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రుల్లో ఎక్కువగా డెలివరీలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో 8, కోదాడలోని 3 ఆస్పత్రుల్లో 100 శాతం సిజేరియన్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. కాన్పుల నిష్పత్తి సగటున నార్మల్, ఆపరేషన్ల శాతం 60 :40 గా ఉండాలి. కానీ ఆస్పత్రుల్లోని డాక్టర్లు అవసరం లేకున్నా 95 శాతానికి పైగా సిజేరియన్ చేస్తున్నారు. కేవలం డబ్బుల కోసమే సిజేరియన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలోని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో సరైన సౌలతులు, డాక్టర్లు, స్టాఫ్ లేకపోవడంతో చాలా మంది గర్భిణులు ప్రైవేట్‌కు పోతున్నారు. రిస్క్, హైరిస్క్ కేసులను ప్రభుత్వ డాక్టర్లే ప్రైవేట్‌కు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సూర్యాపేట మాతా శిశు కేంద్రంలో పనిచేస్తున్న సర్కారు డాక్టర్లకు సైతం క్లినిక్‌లు ఉండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రైవేట్‌లో ముహూర్తపు డెలివరీలు కూడా సిజేరియన్ ఆపరేషన్లకు కారణం అవుతోంది. ప్రభుత్వం ముహూర్తపు డెలివరీలను చేయొద్దని ఆదేశాలిచ్చినా డాక్టర్లు లైట్ తీసుకుంటున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు..
సూర్యాపేటలో అనధికారిక అబార్షన్లు చేస్తున్న ఓ ఆస్పత్రి గుట్టురట్టు చేశారు అధికారులు. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రులు అక్రమ పద్ధతుల్లో అబార్షన్లు చేసి జనం ప్రాణాలు తీస్తున్నారు. కొన్ని ప్రైవేట్ఆస్పత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటంగా ఆడుతున్నాయి. సూర్యాపేటలో ప్రభుత్వ వైద్యాధికారుల కళ్లుగప్పి ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్ల దందా చాలా కాలంగా కొనసాగుతోంది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జరిపిన దాడుల్లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఏకంగా నెలలో 88 అబార్షన్లు చేసినట్లు గుర్తించి రికార్డులను సీజ్ చేశారు.
అయితే, రాజకీయ ఒత్తిడితో ఆ ఆస్పత్రిపై చర్యలకు వెనుకడుగు వేశారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల ఒక ఆస్ప్రతిలో అబార్షన్లు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆస్పత్రిని సీజ్ చేశారు. ఇప్పుడు ఆ ఆస్పత్రిపేరు మార్చి మళ్లీ అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. ఈ విషయం బయటపడకుండా ఒక చిన్న వ్యాన్ లో వచ్చి పెన్ పహాడ్ శివారులో అబార్షన్లు చేస్తున్నట్లు సమాచారం.
చర్యలు తీసుకుంటాం..
ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణులకు ఇష్టమొచ్చినట్లు సిజేరియన్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. ఇప్పటికే 11 ఆస్పత్రులకు నోటీసులు అందించాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ కోట చలం, డీఎంహెచ్‌వో