అంబులెన్స్​ డ్రైవర్లూ హాస్పిటల్స్ పెట్టిన్రు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

  • మల్టీ స్పెషాలిటీ పేరిట అడ్డగోలు దోపిడీ.. స్పెషలిస్టులు ఉండరు.. విజిటింగ్ డాక్టర్లే దిక్కు   
  • ప్రజల ప్రాణాలతో చెలగాటం
  • టీఎస్ఎంసీ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు 
  • పట్టించుకోని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్​మెంట్​

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ప్రైవేట్ హాస్పిటళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సరైన సౌకర్యాలు, క్వాలిఫైడ్ డాక్టర్లు లేకుండానే సూపర్ స్పెషాలిటీ, మల్టీస్పెషాలిటీ బోర్డులు తగిలించుకొని ప్రజలను మోసం చేస్తున్నాయి. అంబులెన్సుల డ్రైవర్లు, నిర్వాహకులు, వ్యాపారస్తులు, రియల్టర్లు సైతం ధనార్జనే ధ్యేయంగా దవాఖానలు పెడుతున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ల పేరిట పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ, అక్కడ ఉండేది ఎంబీబీఎస్ డాక్టర్లే. మరికొన్ని చోట్ల బీఏఎంఎస్​లు, బీహెచ్ఎంఎస్​లతోనే నడుపుతున్నారు. 

అర్హత లేని డాక్టర్లు వచ్చిరాని ట్రీట్​మెంట్​అందిస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ జిల్లా కేంద్రంలోని పలు హాస్పిటళ్లను తనిఖీ చేయగా ఈ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై టీఎస్ఎంసీతో పాటు కలెక్టర్​కు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్​మెంట్​కు రిపోర్ట్ చేసినట్టు సమాచారం.
 
 నాడు అంబులెన్స్...హాస్పిటల్

గతంలో మంచిర్యాలలో అంబులెన్సులు నడిపించిన ఓ వ్యక్తి కొన్నేండ్ల కిందట ఆ దందా బంద్​చేసి ఓ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టాడు. రెవెన్యూ ఆఫీస్ ఎదురుగా ఉన్నప్పుడు థైరాయిడ్ ఆపరేషన్ వికటించి ఓ లేడీ ఆఫీసర్ చనిపోయారు. దీంతో జన్మభూమినగర్​కు అడ్డా మార్చి కొత్త పేరుతో మరో దవాఖాన ఓపెన్ చేశాడు. మల్టీ స్పెషాలిటీ పేరిట నడుస్తున్న ఈ హాస్పిటల్​లో ఎంబీబీఎస్ డాక్టర్ తప్ప స్పెషలిస్టులు ఎవరూ లేరు. అవసరమైనప్పుడు సంబంధిత డాక్టర్లను పిలిపించి ఆపరేషన్లు చేయిస్తున్నట్టు గుర్తించారు. 

డాక్టర్ లేకుండానే... క్రిటికల్ కేర్!

బెల్లంపల్లి చౌరస్తా దగ్గరలో ఉన్న మరో హాస్పిటల్​లో కనీసం ఎంబీబీఎస్ డాక్టర్ కూడా లేడు. గతంలో ఉన్న డాక్టర్లు వెళ్లిపోవడంతో కొంతకాలంగా అర్హత లేని డాక్టర్​తో నడిపిస్తున్నారు. పేషెంట్లు వచ్చినప్పుడు బయటినుంచి డాక్టర్లను పిలిచి వైద్యం అందిస్తున్నారు. క్రిటికల్ కేర్, ట్రామా అండ్ మల్టీ స్పెషాలిటీ పేరిట పబ్లిసిటీ చేసుకుంటూ ప్రజలను దోపిడీ చేస్తున్నారు. జన్మభూమినగర్​లోని మరో హాస్పిటల్​లో ఎంబీబీఎస్ డాక్టరే అన్ని రోగాలకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 

బోగస్ హాస్పిటల్స్​పై టీఎస్ఎంసీ ఫోకస్...

జిల్లాలో పలు హాస్పిటళ్లపై చాలాకాలం నుంచి ఆరోపణలు వస్తున్నా వైద్య ఆరోగ్యశాఖాధికారులు పట్టించుకోవడం లేదు. అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా? స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారా? రూల్స్ పాటిస్తున్నారా, లేదా? అని చూడకుండానే పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ఎంసీ రంగంలోకి దిగి బోగస్ హాస్పిటళ్ల బండారాన్ని బట్టబయలు చేస్తోంది. ఒక్క జిల్లా కేంద్రంలోనే 15కు పైగా బోగస్ హాస్పిటళ్లను గుర్తించినట్టు సమాచారం. టీఎస్ఎంసీ మెంబర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎథికల్ అండ్ యాంటీ క్వాకర్ కమిటీ చైర్మన్ డాక్టర్ యెగ్గెన శ్రీనివాస్ నేతృత్వంలోని టీమ్ ఇటీవల చంద్ర, లోటస్, అమృత హాస్పిటళ్లలో తనిఖీలు చేసి పలు లోపాలను గుర్తించింది. త్వరలోనే మిగతా హాస్పిటళ్లలోనూ తనిఖీ చేయనున్నారు. 

హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది?

రూల్స్ పాటించని హాస్పిటళ్లపై కొరడా ఝుళిపించాల్సిన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్​మెంట్​ఆ పని మర్చిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. రెండేండ్ల కిందట అప్పటి కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని 228 హాస్పిటళ్లను స్పెషల్ టీమ్స్​తో తనిఖీ చేశారు. పర్మిషన్లు లేని 19 చోటామోటా హాస్పిటళ్లను సీజ్ చేశారు. ఆ తర్వాత ఏర్పాటైన ఎథికల్ కమిటీ సైతం సైలెంట్​అయిపోయింది. పై నుంచి ఆదేశాలు వస్తే తప్పా ఆఫీసర్లు ప్రైవేట్ హాస్పిటల్స్ దిక్కు చూడడం లేదు. కార్పొరేట్ లెవెల్​లో హుంగూ, ఆర్భాటాలతో వెలిసిన పెద్ద హాస్పిటల్స్ సైతం రూల్స్ ఫాలో కావడం లేదని తెలిసినా ఆ శాఖ పట్టించుకోవడం లేదు.

ఆర్ఎంపీలు, అంబులెన్సుల దందాపైనా... 

జిల్లాలో రూల్స్​కు విరుద్ధంగా నడుస్తున్న ఆర్ఎంపీ క్లినిక్స్​ను టీఎస్ఎంసీ విజిలెన్స్ టీమ్ తనిఖీలు చేసింది. ఆర్ఎంపీలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాల్సి ఉండగా, కొన్ని చోట్ల ఏకంగా బెడ్స్ వేసి ఇంజక్షన్లు వేయడం, సెలైన్లు ఎక్కడించడమే కాకుండా చిన్న చిన్న సర్జరీలు సైతం చేస్తున్నట్టు తేలింది. కొంతమంది ఆర్ఎంపీలు పేషెంట్లకు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్టు గుర్తించింది. మెడికల్ షాపులు, ల్యాబ్స్​ఏర్పాటు చేసి దోచుకుంటున్న తీరు వెలుగులోకి వచ్చింది. లక్సెట్టిపేటలో ఇద్దరు, మంచిర్యాలలో మరో ఇద్దరు ఆర్ఎంపీలపై పోలీసు కేసులు నమోదయ్యాయి. అంబులెన్స్​ల కమీషన్ దందాపైనా టీఎస్ఎంసీ కొరడా 
ఝుళిపించింది.