ప్రతి ఏరియాలో 95 శాతం ఫుల్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్టల్స్ ఫుల్ అయిపోతున్నాయి. మొన్నటి వరకు ఐటీ ఎంప్లాయ్స్ రాక కోసం ఎదురుచూసిన హాస్టళ్లు ఇప్పుడు రష్ గా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు, చదువులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వచ్చి అకామిడేషన్ కోసం హాస్టళ్లలో ఉంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అమీర్‌పేట్, దిల్ సుఖ్‌నగర్, ఎస్సార్ నగర్, మధురానగర్, కూకట్‌పల్లి, మాదాపూర్ వంటి ఏరియాల్లోని కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకొంటూ దగ్గర్లోని వాటిలో ఉంటున్నారు. దీంతో కొన్ని నెలలుగా ఈ ప్రాంతాల్లోని హాస్టళ్లు రష్ కనిపిస్తోంది. డిసెంబర్ నుంచి ఆఫీసుకు వచ్చేయాలని ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఆదేశించడంతో ఐటీ కారిడార్‌లోని హాస్టల్స్ నిండిపోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా ఫిల్ అయ్యాయని ఓనర్లు చెప్తున్నారు.
ఐటీ ఉద్యోగుల రాక..
కరోనా సమయంలో వర్క్‌ఫ్రమ్ హోం చేసేందుకు ఇంటికి వెళ్లిన ఐటీ ఉద్యోగులు తిరిగి సిటీకి చేరుకుంటున్నారు. అకామిడేషన్ కోసం ఆఫీసులకు దగ్గర్లోని హాస్టల్స్ వెతుక్కుంటున్నారు. ఐటీ కారిడార్‌లో 2,300ల హాస్టల్స్ ఉండగా గతంతో పోలిస్తే ఓనర్లు రూ. 500లు ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం రూ.5,500ల నుంచి హాస్టల్ రెంట్లు ంటున్నాయి. ఎనిమిది నెలల క్రితం 15 శాతంగా ఉన్న హాస్టళ్ల ఆక్యుపెన్సీ ఇప్పుడు 95శాతం వరకు పెరిగిందని ఓనర్లు చెప్తున్నారు. ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉండేలా షేరింగ్ రూమ్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
కరెంట్ బిల్ సపరేట్ ఇస్తున్నరు..
ప్రస్తుతం బిల్డింగ్ అద్దెలు పెరిగిపోయాయని, కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, పనిమనుషులు దొరకట్లేదని ఇలా వివిధ కారణాలతో అద్దెలు రూ.500లు పెంచామని ఓనర్లు అంటున్నారు. మాములుగా అయితే నెల చార్జీలోనే అకామిడేషన్, ఫుడ్, వాటర్, కరెంట్ అన్నీ కలిపి తీసుకునేవారు. అయితే కరెంట్ బిల్లులు విపరీతంగా వస్తుండటంతో రూమ్‌లకు సపరేట్‌గా సబ్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రూమ్‌కి వచ్చే బిల్లును ఉంటున్నవారే కట్టాలని పేర్కొంటున్నారు.
ఆక్యుపెన్సీ పెరుగుతోంది..
ఉద్యోగులు ఉంటేనే ఐటీ కారిడార్‌లో హాస్టళ్ల నిర్వహణ సాధ్యమవుతుంది. కరోనా కంటే ముందు హాస్టల్స్‌లో దాదాపు 90శాతం ఆక్యుపెన్సీ ఉండేది. ఆ తర్వాత మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. చాలామంది హాస్టల్స్‌లో ఉండటానికి ఇష్టపడుతుండటంతో ఆక్యుపెన్సీ పెరుగుతోంది.
- అమర్నాథ్రెడ్డి, అధ్యక్షుడు, ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్
కరెంటు బిల్లులు పెరిగాయి
స్టార్టప్‌లు, చిన్న కంపెనీలు పూర్తిగా తెరుచుకున్నాయి. స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు 65 నుంచి 75 శాతం ఆక్యుపెన్సీతో మా హాస్టల్నడుస్తోంది. అయితే బిల్డింగ్ రెంట్లను ఓనర్లు పెంచేశారు. దీనికితోడు ఇప్పుడు కరెంట్ బిల్లులు కూడా అధికంగా వస్తున్నాయి. మెయింటెనెన్స్ చాలా ఇబ్బందిగా మారింది. అందుకే రూమ్‌కి సబ్ మీటర్లు ఏర్పాటు చేశాం.
- కరుణాకర్, హాస్టల్ ఓనర్, గచ్చిబౌలి