ఇంటర్ కాలేజీల గుర్తింపుపై హైడ్రామా

ఇంటర్ కాలేజీల గుర్తింపుపై హైడ్రామా

కాలేజీలు మొదలై 4 నెలలు గడిచినా గుర్తింపుపై తేల్చలే
మిక్స్ డ్ ఆక్యుపెన్సీ,ఫైర్ఎన్ఓసీ లేకపోవడంతోఆగిన అఫిలియేషన్  
330 కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్లలో ఆందోళన 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్  ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్లపై హైడ్రామా కొనసాగుతోంది. కాలేజీలు ప్రారంభమై నాలుగు నెలలు దాటినా.. ఇప్పటికీ వందల కాలేజీల గుర్తింపుపై విద్యాశాఖ తేల్చడం లేదు. దీంతో ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులు, వారి పేరెంట్స్  ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,497 ఇంటర్  ప్రైవేటు జూనియర్  కాలేజీలు ఉన్నాయి. ఆయా కాలేజీలకు 2024–25  విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ల కోసం ఇంటర్  బోర్డు ఫిబ్రవరిలోనే ప్రక్రియను ప్రారంభించింది. 

మే నెలాఖరులోపే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించినా సాధ్యం కాలేదు. అయితే, ఇప్పటికీ 1,167 కాలేజీలకు మాత్రమే ఇంటర్  బోర్డు గుర్తింపు ఇచ్చింది. మరో 330 కాలేజీలు మిక్స్ డ్  ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్  కాలేజీలకు ఇంత వరకూ అఫిలియేషన్  రాలేదు. అయితే, ఆయా కాలేజీలకు గుర్తింపు లేదనే విషయం ముందుగానే తెలిసినా.. ఇంటర్  బోర్డు అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికే గత ప్రభుత్వం మూడుసార్లు ఆయా కాలేజీల అఫిలియేషన్లకు ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చింది.  

విద్యాశాఖ దృష్టికి..


మిక్స్ డ్  ఆక్యుపెన్సీ కాలేజీలపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఈ అంశాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఇంటర్  బోర్డు తీసుకుపోయింది. సుమారు నెల రోజుల క్రితం ఆయా కాలేజీలపై ఎం చేయాలో స్పష్టత ఇవ్వాలని విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశానికి లేఖ రాశామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ కాలేజీలకు ఫైర్​ ఎన్ఓసీ ఇవ్వాలంటే హోం శాఖతోనూ చర్చించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. 

అయితే, చివరి నిమిషం దాకా అఫిలియేషన్లపై నాన్చడంతో ఇటు స్టూడెంట్లు, అటు పేరెంట్స్  తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ముందే గుర్తింపులేని కాలేజీల లిస్టును అధికారికంగా ఇంటర్  బోర్డు ప్రకటిస్తే బాగుండని పేరెంట్స్  చెప్తున్నారు. ప్రస్తుతమైతే గుర్తింపు ఇచ్చి.. భవిష్యత్తులో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

సీఎం జోక్యం చేసుకోవాలి

ప్రస్తుతం మిక్స్ డ్  ఆక్యుపెన్సీ భవనాల్లోని కాలేజీలన్నీ 20 నుంచి 25 ఏండ్ల కింద ఏర్పాటు చేసినవి. గత ప్రభుత్వం కూడా మినహాయింపు ఇచ్చింది. అప్పట్లో కాంగ్రెస్  పార్టీ మేనేజ్మెంట్లకు మద్దతుగా ఉంది. ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా.. ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

- గౌరీసతీష్, టీపీజేఎంఏ స్టేట్ ప్రెసిడెంట్-