ఇల్లెందు పట్టణంలో విద్యార్థిపై ప్రిన్సిపాల్​ దాడి

ఇల్లెందు, వెలుగు : పట్టణంలోని ఓ ప్రైవేట్​ జూనియర్​ కాలేజీ ప్రిన్సిపాల్​విద్యార్థిపై దాడి చేసినట్లు స్టూడెంట్​ తండ్రి మంగళవారం ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  తెలిపాడు.  పట్టణంలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న తన కుమారుడు శనివారం గాయంతో ఉన్న తన ఫ్రెండ్​ను కాలేజీ నుంచి ట్రీట్​మెంట్​ కోసం హస్పిటల్​కు తీసుకవెళ్లాడన్నారు. అక్కడికి కాలేజీ లెక్చరర్​ కూడా వచ్చి చూసి వెళ్లారని తండ్రి వీరునాయక్ తెలిపారు. సాయంత్రం కాలేజీకు తిరిగి వెళ్లగా సోమవారం  తల్లిదండ్రులను తీసుకొని రావాలని తెలిపాడన్నారు.

సోమవారం కాలేజీకు వెళ్లిన తన కొడుకును ప్రిన్సిపాల్ చితకబాదాడని తెలిపారు.  ప్రిన్సిపాల్, కాలేజీపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.  ఘటనపై ప్రిన్సిపాల్​ను వివరణ కోరగా శనివారం బ్రేక్​ అనంతరం నలుగురు విద్యార్థులు అనుమతి లేకుండా బయటకు వెళ్లినట్లు తెలిసిందన్నారు.  అదేరోజు సాయంత్రం కాలేజీకి రాగా సోమవారం తల్లిదండ్రులను తీసుకు రావాలని సూచించామన్నారు.  సోమవారం కాలేజీకి వచ్చిన విద్యార్థిని బయటకు ఎందుకు వెళ్లావని అడగగా తనతో దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు.