ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ మిల్లర్లే టాప్

ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ మిల్లర్లే టాప్
  • మూడు సీజన్​ల నుంచి సీన్​ రిపీట్​
  • జనవరి నుంచి తెల్లరేషన్​ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ 
  • కస్టం మిల్లింగ్​ అశ్రద్ధ చేస్తే పంపిణీ కష్టం
  • టార్గెట్​ కన్నా తక్కువ కొనుగోలు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జిల్లాలో వరి సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను సకాలంలో ఏర్పాటుచేయకపోవడంతో లక్ష్యం మేర కొనుగోళ్లు జరగడంలేదు. దీంతో గత మూడు సీజన్​ల నుంచి ప్రైవేట్​ మిల్లర్లదే పైచేయిగా ఉంది. జనవరి నుంచి రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు వడ్ల కొనుగోళ్ల టార్గెట్​ను భారీగా ప్రకటించినా యంత్రాంగం సక్సెస్ కాలేదు. కొనుగోలు చేసిన వడ్లతో జిల్లా వరకు ఢోకాలేకున్నా, సీఎంఆర్ సేకరణపై మొదటి నుంచి ఫోకస్​ పెడ్తేనే అది సాధ్యమవుతుంది.

4.30 లక్షల ఎకరాల్లో వరి సాగు

నిజామాబాద్​​జిల్లా రైతులు వరిసాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మద్దతు ధరకు తోడు సన్నాలకు ప్రభుత్వం​ రూ.500 బోనస్​ ప్రకటించడంతో వరిసాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్​లో 4.30 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిని పండించగా, అందులో  80 శాతం సన్నరకం సాగు చేశారు. 12 లక్షల మెట్రిక్​ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేసి 8 లక్షల టన్నులు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని టార్గెట్​ పెట్టుకున్నారు. నిజాంసాగర్​ ప్రాజెక్టు పరిధిలోని బాన్సువాడ, బోధన్, రూరల్ సెగ్మెంట్లో వరి కోతలు అక్టోబర్​ మొదటి వారం షురువై ఆ నెలాఖరునాటికి దాదాపు ముగిశాయి. నవంబర్ మొదటి వారంలో సర్కారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే నాటికి సుమారు 7 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం మిల్లర్లే కొనుగోలు చేశారు. 

Also Read : మరో 27,612 రైతులకు రుణమాఫీ

 కస్టం మిల్లింగ్​కు సంబంధించి సర్కారు విధివిధానాల రూపకల్పనలో జాప్యం కూడా ప్రభుత్వ కొనుగోళ్లపై ప్రభావం చూపింది. వాతావరణం సరిగా లేకపోవడంతో రైతులు సెంటర్లు ఓపెన్​ అయ్యేవరకు వెయిట్​ చేయకుండా ప్రైవేట్​ వ్యాపారులకు వడ్లు అమ్ముకున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో4.90 లక్షల   టన్నులే కొన్నారు. అందులో సన్నాలు సుమారు 3 లక్షల టన్నులు,  దొడ్డురకం 1.90 లక్షల టన్నులు ఉన్నాయి. 2023–-24  యాసంగిలో మొత్తం 11.72 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్ల దిగుబడి వచ్చింది. 6 లక్షల టన్నుల కొనుగోలు టార్గెట్​పెట్టుకొని 4.33 లక్షల టన్నులే కొనుగోలు చేశారు. అంతకు ముందు ఖరీఫ్​లో కొనుగోళ్లు 4 లక్షల టన్నులకే పరిమితమయ్యాయి. 2022-–23 రెండు సీజన్​లలో 5.85 లక్షల టన్నుల ధాన్యం  కొనుగోలు చేశారు.  

సీఎంఆర్​ కీలకం

కల్లాల్లో ధాన్యం చేరే సమయానికి ముందే సర్కారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే రైతులు వడ్లను తరలిస్తారు. ఎక్కువ కొనుగోళ్లతో జిల్లా అవసరాలుపోను పొరుగు జిల్లాలకు బియ్యం సరఫరా చేసే వీలుంటుంది. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్​కార్డులకు సన్న బియ్యం సరఫరా చేయాలనే ప్రభుత్వ​ నిర్ణయం మేరకు జిల్లాలోని 4.02 లక్షల కార్డులకు లబ్ధి చేకూరనుంది. రేషన్​ కార్డులు, ప్రభుత్వ హాస్టల్స్, మిడ్​డే మీల్స్​ తదితర వాటికి కలిపి ప్రతీనెలా సుమారు 9 వేల మెట్రిక్​ టన్నుల చొప్పున ఏడాదికి 1.08 లక్షల టన్నుల  రైస్​ కావాలి. 

ఈ ఖరీఫ్​లో కొనుగోలు చేసిన 3.20 లక్షల టన్నుల సన్నవడ్ల నుంచి 1.97 లక్షల టన్నుల బియ్యం సీఎంఆర్​గా వస్తాయి. కస్టం మిల్లింగ్​ బియ్యం పట్ల మొదటి నుంచి ఫోకస్ పెడితేనే అంతా సాఫీగా జరుగుతుంది. ఇప్పటికే 2023–-24 రెండో సీజన్​కు చెందిన 2.07 లక్షల టన్నుల సీఎంఆర్​ రైస్​ మిల్లర్ల వద్ద బాకీ ఉన్నాయి. అందుకు సంబంధించిన వడ్లు పక్కదారి పట్టాయని విజిలెన్స్​ విచారణ నడుస్తోంది.