జనగామ, వెలుగు: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు సెంటర్లలో ప్రైవేటు కాంటాలు జరుగుతున్నాయి. క్వింటాలుకు రూ.1900 ధర వస్తుండడంతో సర్కారు కొర్రీలు తాళలేక రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధర రూ.2060 ఉన్నప్పటికీ తేమ, తాలు, కాంటా, లిఫ్టింగ్ చార్జీలకు తోడు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీంతో అన్నదాతలు ప్రైవేటుకే ఆసక్తి కనబరుస్తున్నారు.
సొసైటీ సెంటర్లలో పేచీలు..
గతంతో పోలిస్తే ఈసారి సొసైటీలకు ఎక్కువ సెంటర్లు కేటాయించారు. ఇదే క్రమంలో ఐకేపీ కంటే సొసైటీ సెంటర్ల వద్దే కొర్రీలు ఎక్కువగా ఉంటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గాలి పట్టే మెషిన్ లో తూర్పార పడితేనే కొంటామని నిర్వాహకులు మొండి కేస్తున్నట్లు వాపోతున్నారు. బయట తూర్పార పట్టి తీసుకువచ్చినా ఒప్పుకోకుండా మళ్లీ తూర్పార పట్టిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ మెషిన్ కు గంటకు రూ.500 వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. దీనికి తోడు కిలో అదనంగా తూకం వేస్తున్నట్లు చెబుతున్నారు. సుతిలీ, హమాలీ ఖర్చులు అదనం. మరోవైపు కొనుగోళ్లు సైతం స్లోగా సాగుతుండడంతో రైతులు బయటి వ్యక్తులకే అమ్ముకుంటున్నారు.
జోరుగా దందా..
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో 20 సర్కారు సెంటర్లు ఏర్పాటు చేయగా ఇందులో 15 సొసైటీలు, 5 ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరుగుతున్న సెంటర్లలో ప్రైవేట్ దళారులు వచ్చి దర్జాగా కాంటాలు వేసుకుని వడ్లు తరలించుకుపోతున్నారు. క్వింటాలుకు రూ.1900 ధర వేస్తుండడంతో పాటు హమాలీ తదితర ఏ ఖర్చులు లేకుండా కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో రైతులు సదరు దళారులకే అమ్ముకుంటున్నారు. సాల్వాపూర్, మాన్ సాన్ పల్లి, పడమటి కేశవాపూర్, లింగంపల్లిల లకు చెందిన వరి ధాన్యాన్ని వట్టిపల్లి నుంచి వచ్చే దళారులు కొనుక్కుని సిద్దిపేటకు తరలిస్తున్నారు. సోలమైల్, కట్కూరు, ఆలింపూర్, బండనాగారం లకు చెందిన ధాన్యాన్ని చేర్యాల వైపు దళారులు తీసుకెళ్తున్నారు. వీరు 15 రోజుల్లో రైతులకు డబ్బులు ఇస్తామనే ఒప్పందంతో కొనుగోళ్లు చేస్తున్నారు.
650 గ్రా. మాత్రమే తరుగు తీయాలి..
భీమదేవరపల్లి: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సంచికి 650 గ్రా. మాత్రమే తరుగు తీయాలని, ఎక్కువ తీస్తే కఠిన చర్యలు తప్పవని హనుమకొండ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి హెచ్చరించారు. మంగళవారం భీమదేవరపల్లి మండలంలోని ములుకనూర్,కొత్తకొండ, వంగర, కొత్తపల్లి గ్రామాల్లో ఆమె పర్యటించి, కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తరుగులో అధిక కోత విధించి, రైతులను ఇబ్బందిపెట్టవద్దన్నారు. జిల్లాలో107 కేంద్రాలు ప్రారంభం కాగా త్వరలో మరో 50 కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు.
ఎక్కడి కుప్పలు అక్కడే..
పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు బార్దాన్ అందలేదు. దీంతో ఎక్కడికుప్పలు అక్కడే దర్శనమిస్తున్నాయి. ఐదు రోజుల కింద ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా.. కాంటాలు వేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండ్రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చి, మబ్బులు కమ్ముకోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆఫీసర్లు స్పందించి, బార్దాన్ అందించి, కాంటాలు స్టార్ట్ చేయాలని రైతులు కోరుతున్నారు.