ప్రైవేటుకే సోయాబీన్​ విక్రయాలు

ప్రైవేటుకే సోయాబీన్​ విక్రయాలు
  • పదిరోజులుగా సోయాబీన్​  కోతలు
  • మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం 
  • కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని వైనం
  • ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు 
  • జిల్లా వ్యాప్తంగా 36,419 ఎకరాలలో సాగు

సోయాబిన్ ​పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు ఎంఎస్​పీ కన్నా రూ.200 తక్కువ రేటుకే పంటను కొనుగోలు చేస్తున్నారు. నగదు ఒకేసారి  చెల్లిస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే వరకు ఆగడం లేదు.

బోధన్, వెలుగు: పదిరోజులుగా జిల్లాలో సోయాబీన్ కోతలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు విక్రయిస్తున్నారు. సోయాబీన్​ పంటకు ప్రభుత్వం క్వింటాల్​కు.4,892 రేటు నిర్ణయించింది. రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూడకుండా ప్రైవేటు వ్యాపారస్తులకు రూ.4600 లకే అమ్ముకుంటున్నారు. నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా సోయాబీన్ 36,419.23 ఎకరాలలో సాగుచేసినట్లు వ్యవసాయశాఖ తెలిపింది.

బోధన్ డివిజన్​లో ఎక్కువగా నల్లరేగడి భూములు ఉండడంతో 18,124 ఎకరాలలో సాగుచేస్తున్నారు. బోధన్​ మండలంలో 7,372ఎకరాలు, సాలూరలో 5,355 ఎకరాలు, రెంజల్​లో 5,333 ఎకరాలు, నవీపేట్​లో 64.11 ఎకరాలలో సాగుచేస్తున్నట్లు వ్యవసాయాధికారులు వెల్లడించారు. బోధన్​ డివిజన్​లో మంజీర సరిహద్దు  నల్లరేగడి భూములు ఉండటంతో ఏటా సోయాబీన్​పంటను ఎక్కువగా సాగు చేస్తారు. 

ప్రైవేటు వ్యాపారులకు విక్రయం

సోయాబీన్​కు ప్రభుత్వం క్వింటాల్​కు రూ.4892లు ధర నిర్ణయించినా రూ.4600 లకు ప్రైవేటు వ్యాపారులకు అమ్మడానికే రైతులు మొగ్గు చూపుతున్నారు.  సోయాబీన్​ పంట ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రానికి తరలించాలంటే వారంపాటు పంటను ఆరబెట్టాలని, దీంతో  కూలీ రేట్లు, టార్పాలిన్​ కిరాయి వంటి ఖర్చుల వల్ల ఆర్ధిక భారం పడుతుందని అంటున్నారు.  ప్రైవేటు వ్యాపారులు నగదు వెంటనే చెల్లిస్తున్నారని తెలిపారు.  

అలాగే సోయాబీన్​ పంట నూర్పిళ్లు చేసిన తర్వాత రోడ్డుపై ఆరబెడితే వర్షానికి తడిసిపోతుండటంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తే  డబ్బుల కోసం నెల రోజులు ఆగాల్సి వస్తోందని, ఒక్కోసారి డబ్బులు ఎప్పుడు వస్తాయని తెలియదంటున్నారు.   అందుకోసమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కంటే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు భావిస్తున్నారు.