- 30 మంది విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
- డ్రైవర్ బదులు క్లీనర్ బస్సు నడపడమే కారణం
- ఇరుకుగా ఉన్న రోడ్డులో నడపలేక పొలాల్లోకి వెళ్లి బోల్తా పడ్డ బస్సు
నవీపేట్, వెలుగు : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని నాడపూర్ గ్రామశివారులో ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. గురువారం ఉదయం 30 మంది పిల్లల్ని నాడపూర్ నుంచి నవీపేట్ కు తీసుకువస్తుండగా పొలాల్లోకి వెళ్లి పడిపోయింది. ఈ ప్రమాదంలో 30 మంది పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మండల కేంద్రానికి చెందని సాహితి స్కూల్ బస్సును క్లీనర్ భోజన్న నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బస్సు బోల్తా పడగానే కమలాపూర్ గ్రామస్తులు వచ్చి బస్సులోంచి విద్యార్థులను బయటకు తీశారు.
డ్రైవర్ కు బదులు క్లీనర్ డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగిందన్నారు. దీంతో పాటు ఆర్అండ్ బీ రోడ్డును కబ్జా చేసి పొలం చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఘటన జరిగిన తీరును పరిశీలించారు.