స్కూల్ ​బస్సులు ఫిట్​లెస్..పట్టించుకోని అధికా రులు

నల్గొండ/యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : బడులు తెరుచుకున్నాయి.. బడి బస్సులు రోడ్డెక్కుతున్నాయి. కానీ ఆ బస్సుల్లో చాలా వరకూ ఫిట్​లెస్​గా ఉన్నాయి.  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,737 స్కూల్​ బస్సులు ఉంటే  అందులో 601 బస్సులు మాత్రమే ఫిట్​నెస్​ టెస్టు చేయించారు. ఇంకా 1136 బస్సుల సంగతి తేలాల్సి ఉంది. ఈ విషయంలో ఆ స్కూళ్ల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉండగా, అధికారులు కూడా వారిని పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. ఏదేమైనా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదని పలువురు హెచ్చరిస్తున్నారు. 

ఇదీ పరిస్థితి.. 

సూర్యాపేట జిల్లాలో  150కి  పైగా ప్రైవేట్ స్కూళ్లు ఉండగా వీటిలో 25వేలకు పైగా స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్కూళ్లకు సంబంధించి 632 స్కూల్‌‌ బస్సులు ఉన్నాయి. వాటికి మే 15 నుంచే ఫిట్‌‌నెస్‌‌ టెస్టులు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. కానీ ఇప్పటివరకు  166  స్కూల్‌‌ బస్సులకు మాత్రమే ఫిట్‌‌నెస్‌‌ టెస్టులు చేయించారు. మిగతా 466  బస్సుల జాడ లేదు. 

యదాద్రి జిల్లాలో 235 బస్సులు ఉండగా ఇప్పటి వరకు 105 బస్సులకు మాత్రమే ఫిట్ నెస్ టెస్ట్ చేయించారు. ఇంకా 130 బస్సులకు ఫిట్ నెస్ టెస్టులు చేయకుండానే రోడ్డు ఎక్కిస్తున్నారు. 

నల్గొండ జిల్లాలో 870 స్కూల్ బస్సులు ఉన్నాయి. దీంట్లో 305 బస్సులు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే పేపర్ మీద మాత్రమే 870 బస్సులు ఉన్నాయని, ప్రస్తుతం నడుస్తున్న స్కూల్​ బస్సులు 520 మాత్రమే ఉన్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా 350 బస్సులను స్కూల్ యాజమాన్యాలు తుక్కు కింద పడేశారా? ఎవరికైనా అమ్మారా? అనే వివరాలు ఆర్టీఓ ఆఫీసులో లేవు. రూల్స్ ప్రకారం అయితే గడువు దాటిపోయిన వాహనాలు ఏవైనా ఆర్టీఓ పర్మిషన్​తోనే తుక్కు కింద పడేయాల్సి ఉంది. 

ఫిట్​లెస్​ బస్సులు రోడ్డెక్కితే ఎలా? 

ఫిట్​లెస్​ బస్సులు రోడ్డెక్కితే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూల్​బస్సుల డ్రైవర్లకు లైసెన్స్ లు లేవనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరిగి పిల్లల ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. స్కూల్ రీ ఓపెన్ సమయంలో ఆర్టీ‌‌ఏ ఆధ్వర్యంలో స్కూల్​ బస్సుల ఫిట్ నెస్ పై నిర్వహించే అవగాహన కార్యక్రమాలు, ఫిట్ నెస్ రెన్యూవల్ కోసం స్పెషల్ డ్రైవ్స్ చేపట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు గ్రామాల నుంచి స్టూడెంట్స్​ను ఆయా స్కూళ్లు ఆటోలు, టాటా మాజిక్ లను వాడుతున్నాయి.  వీటిలో 20మందికి పైగా స్టూడెంట్లను కుక్కి తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

ఆ బస్సులను సీజ్ చేస్తాం 

ప్రైవేట్ స్కూళ్ల యజమాన్యాలు బస్సులకు తప్పనిసరిగా ఫిట్ నెస్ పరీక్ష చేయించుకోవాలి. ఫిట్ నెస్ లేని బస్సులను రోడ్లపై నడిపితే సీజ్​ చేస్తాం. లైసెన్స్ ఉన్న డ్రైవర్లను మాత్రమే నియమించాలి.

- వెంకట్ రెడ్డి, ఆర్టీఏ, సూర్యాపేట