ఫిట్‌నెస్​ లేకుండానే రోడ్లపైకి.. బస్సులను చెక్​ చేయించడంలో ప్రైవేట్​ విద్యాసంస్థల నిర్లక్ష్యం

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫిట్‌నెస్​సర్టిఫికెట్ లేకుండానే వివిధ విద్యాసంస్థలకు చెందిన సగం బస్సులు రోడ్డెక్కాయి. అకడమిక్ ఇయర్ స్టార్ట్ కావడానికి ముందే ఆర్టీఏ ఆఫీసులో ఫిట్‌నెస్  చెకింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా.. సోమవారం వరకు సగం బస్సులు కూడా చెకింగ్ కు రాలేదు. విద్యార్థులను స్కూళ్లకు తరలించే బస్సుల కండీషన్ ​విషయంలో విద్యాసంస్థలు నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఫిట్ నెస్ సర్టిఫికెట్లు లేని బస్సుల్లో ప్రముఖ విద్యాసంస్థలకు చెందినవే  ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఆర్టీఏ అధికారులు సైతం ఈ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 

టెస్టులకు రాని బస్సులు 812 .. 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలకు చెందిన బస్సులు 1629 ఉంటే.. ఇందులో ఇప్పటివరకు కేవలం 817 బస్సులే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాయి. మే 15 నుంచి జూన్ 11 వరకు నిర్వహించిన చెకింగ్స్ కు మిగతా 812 బస్సులను స్కూల్​యాజమాన్యాలు పంపించలేదు. ఇందులో కరీంనగర్ జిల్లాలో  818 బస్సులకు 468 బస్సులు, పెద్దపల్లి జిల్లాలో 249 బస్సులకు 75, జగిత్యాల జిల్లాలో 427  బస్సులకు 213, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 135  బస్సులకు 61 బస్సులు మాత్రమే ఫిట్ నెస్ కలిగి ఉన్నాయి. 

15 ఏళ్లు పూర్తయినా రోడ్లపైకి.. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సులను రవాణాకు ఉపయోగించొద్దు. ఇలా 15 ఏండ్లు పూర్తిచేసుకున్న బస్సులు ఉమ్మడి జిల్లాలో 763 వరకు ఉన్నాయి. ఇందులో కరీంనగర్ జిల్లాలో 407, జగిత్యాలలో 211, పెద్దపల్లి జిల్లాలో 123, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22 వరకు ఉన్నాయి. ఈ బస్సులను కూడా ఆయా విద్యాసంస్థలు స్టూడెంట్స్ రవాణాకు ఉపయోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 15 ఏళ్లు పూర్తయిన బస్సులను సీజ్ చేయడంలో ఆయా జిల్లాల ఆర్టీఏ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

నిబంధనలు ఇలా ఉన్నాయి... 

స్టూడెంట్స్‌ను తరలించే బస్సులకు కచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. కానీ ఇది చాలా బస్సుల్లో అలంకారప్రాయంగా మారింది. బస్సుపై విద్యాసంస్థ పేరు, అడ్రస్, ఫోన్​ నంబర్ రెండు వైపులా రాసి ఉండాలి. ప్రతి బస్సులో ఒక అసిస్టెంట్, 60 ఏళ్లలోపు ఏజ్ ఉండి, హెవీ వెహికిల్స్ పై ఐదేళ్ల ఎక్స్ పీరియన్స్, మంచి కంటి చూపు, ఆరోగ్యం కలిగిన డ్రైవర్ ఉండాలి. బస్సుకు సంబంధించిన అన్ని పేపర్లు, విద్యార్థులంతా డ్రైవర్ కు కనిపించేలా కుంభాకారపు అద్దం బస్సులో ఏర్పాటు చేయాలి. నాణ్యమైన టైర్లను వినియోగించాలి... ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ.. ఆర్టీఏ అధికారులు తూతూమంత్రంగా ఫిట్ నెస్ చెకింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం బస్సు నంబర్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యుషన్ సర్టిఫికెట్లు చూసి ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.   

ఫిట్ నెస్ లేకుండా రోడ్డెక్కితే సీజ్ చేస్తాం.. 

జిల్లాలో ఇంకా 812 బస్సులు ఫిట్ నెస్ చెకింగ్స్ కు తీసుకురాలేదు.  చెకింగ్ పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆ బస్సులను  రోడ్లపై  తిప్పొద్దు. 15 ఏండ్లు పూర్తయిన బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల పైకి రావొద్దు. ఆ వాహనాలను సీజ్ చేయడమేగాక యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బస్సు కండిషన్ లో ఉంచడంతోపాటు అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవాలి.  త్వరలో విద్యాసంస్థల యాజమాన్యాలు, డ్రైవర్లతో మీటింగ్​నిర్వహిస్తాం. 

మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్,  డీటీసీ, కరీంనగర్