జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ ఇష్టారాజ్యం .. పర్మిషన్లకు పాతర..!

  • కొన్నిచోట్ల అనుమతులు లేకుండానే తరగతుల నిర్వహణ
  • బుక్స్, యూనిఫామ్స్ పేరుతో అడ్డగోలు వసూళ్లు
  • రూల్స్ కు విరుద్ధంగా ప్లే స్కూల్స్
  • అయినా లైట్ తీసుకుంటున్న అధికారులు

హనుమకొండ, వెలుగు: ఓరుగల్లులో ప్రైవేటు స్కూళ్లు పర్మిషన్లకు పాతర వేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అరకొర పర్మిషన్లతో తరగతులు నిర్వహించడమే కాకుండా అడ్డగోలు ఫీజులు, అదనపు బాదుడుతో విద్యార్థుల పేరెంట్స్ జేబులకు చిల్లులు పెడుతున్నాయి. బుక్స్, యూనిఫామ్స్ కూడా తమ వద్దే తీసుకోవాలనే రూల్ పెడుతూ ఇష్టారీతిన దోపిడీ చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పలు స్కూళ్లపై ఫిర్యాదులు వెల్లువెత్తగా, చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పర్మిషన్లు లేకుండానే క్లాసులు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 3,328 వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 836 ప్రైవేటు స్కూళ్లు నడుస్తున్నాయి. కానీ, అధికారుల లెక్కల్లో రాని ప్రైవేటు స్కూళ్లు కూడా చాలానే ఉన్నాయి. అక్రమార్జనే ధ్యేయంగా పర్మిషన్లు లేకుండా గల్లీకో స్కూల్ రన్ చేస్తుండగా, ప్రైమరీ స్కూళ్లకు అనుమతి తీసుకుని కొంతమంది హై స్కూల్ చదువులు చెబుతుండటం గమనార్హం. అర్హత లేని టీచర్లతో పాఠాలు చెప్పిస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరున దందా చేస్తున్నారు. హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ శివారులో నిర్వహించిన ఓ బడా ప్రైవేటు స్కూల్ ను కొన్ని కారణాలతో మూడేండ్ల కిందట ఎల్కతుర్తి శివారులోని ఇందిరానగర్ కు మార్చారు.

కానీ, ఎలాంటి అనుమతులు లేకుండానే 8, 9, 10 తరగతులకు అడ్మిషన్లు చేయించి, క్లాసులు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఫీజులు నిర్ణయించి, విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు. దీంతో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో ప్రీ స్కూల్స్ కు డిమాండ్ పెరిగిపోగా, ప్లే వే స్కూళ్ల పేరున ప్రైవేటు యాజమన్యాలు దందా మొదలు పెడుతున్నాయి.

బుక్స్, యూనిఫామ్స్ పేరుతో దోపిడీ..

విద్యాసంస్థల్లో టెక్ట్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, షూస్ ఇలా ఏవీ అమ్మొద్దనే నిబంధనలున్నా ఏ స్కూల్ పెద్దగా పట్టించుకోవడం లేదు. విద్యార్థి చదువుకు అవసరమయ్యే ప్రతిదీ తమ స్కూల్ లో కొనాల్సిందేనని రూల్ పెడుతున్నాయి. ఒకటి, రెండో తరగతుల పిల్లల బుక్స్ కు కూడా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇలా దందా చేస్తుండగా, ఇటీవల కమలాపూర్ మండలంలోని ఓ ప్రైవేటు స్కూల్ లో విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున స్కూల్ యూనిఫామ్స్ పట్టుకుని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

జిల్లాలోని దాదాపు అన్ని ప్రైవేటు స్కూల్స్​ ఫీజు నియంత్రణను కూడా పట్టించుకోవడం లేదు. ఎల్ కేజీ, యూకేజీకి కూడా లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. ఇదే విషయమై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం పేద విద్యార్థులకు అడ్మిషన్​ కల్పించాలనే నిబంధన ఉన్నా, అమలైన దాఖలాలే కనిపించడం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు రూల్స్ పాటించని ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకుని, ఫీజుల నియంత్రణ చేపట్టాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

రిజిస్ట్రేషన్​ లేకుండానే..!

ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్ సరైన రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే నడుస్తోంది. చింతగట్టు క్యాంపు లోని మరో స్కూల్ ఒక పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని, మరోపేరుతో నిర్వహిస్తున్నారు. ఇదే విషయమై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇటీవల గోల్డెన్ స్మైల్ పేరుతో కూలిపోయే దశలో ఉన్న రేకుల షెడ్డులో ప్లేస్కూల్​ను ప్రారంభించారు. దీంతో స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తగా, ఆ స్కూల్ కు పర్మిషన్ లేదంటూ ఎంఈవో ఓ తెల్లకాగితంపై లెటర్ రాసి స్కూల్ గేట్​కు అంటించారు. అంతేగానీ స్కూల్ యాజమాన్యంపై మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.