
- మొత్తం చెల్లిస్తేనే ఎస్ఏ2 పరీక్షలకు అనుమతి.. ఐదు, పది వేలు పెండింగ్ ఉన్నా నో ఎంట్రీ
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఫాతిమా హైస్కూల్ లో ఓ బాలిక ఏడో తరగతి చదువుతోంది. మొత్తం ఫీజు రూ.32 వేలు కాగా.. రూ.22 వేలు కట్టేశారు. మిగిలిన ఫీజు చెల్లించలేదని బాలికను ఎస్ఏ2(సమ్మెటీవ్ అసెస్ మెంట్) పరీక్షలకు మేనేజ్మెంట్ అనుమతించలేదు. అక్కడ ఫీజు కట్టలేదని తొలిరోజు ఏకంగా 60 మందితో పరీక్ష రాయించలేదు”
ఖైరతాబాద్ లోని హోలీ మేరి స్కూల్ లోనూ ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న సుమారు 50 మందికి పైగా విద్యార్థులను ఫీజు చెల్లించలేదనే కారణంతో స్కూల్ మేనేజ్మెంట్ తొలిరోజు ఎగ్జామ్ రాయనీయలేదు.
క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ షీట్లు ఇచ్చిన తర్వాత ఫీజు కట్టని విద్యార్థుల పేపర్లను అందరి ముందు లాక్కున్నారు. ఈ విషయంపై పేరెంట్స్ ఆందోళన చేపట్టారు"
హైదరాబాద్ లోనే మరో ఓ ప్రైవేటు స్కూల్లో గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఫీజు చెల్లించినా.. ఆన్లైన్లో అప్డేట్ కాకపోవడంతో పిల్లలను పరీక్ష రాయనీలేదు"
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వందలాది ప్రైవేటు బడుల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సిటీ, మండలం అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఎగ్జామ్స్ సమయంలో ఫీజుల కోసం ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్లు దౌర్జన్యం చేస్తున్నాయి. రాష్ట్రంలో11వేల ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లుండగా.. వాటిలో 33 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. స్టేట్ సిలబస్ బడుల్లో ఈ నెల 9 నుంచి ఎస్ఏ 2 ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల వేధింపులు భారీగా పెరిగాయి. ఎల్కేజీ, యూకేజీ నుంచి 9వ తరగతి పిల్లల వరకు అందరూ పూర్తి ఫీజులు చెల్లిస్తేనే ఎగ్జామ్స్ రాయనిస్తామని పలు స్కూళ్ల మేనేజ్మెంట్లు వేధిస్తున్నాయి. రూ.5 వేలు, పది వేల ఫీజు బకాయిలు ఉన్నా ఎగ్జామ్ రాయనీయలేదు. పలు స్కూళ్లలో పిల్లలను ఎగ్జామ్స్ హాళ్ల నుంచి వెళ్లగొట్టిన ఘటనలూ కన్పించాయి.
మానసిక క్షోభకు గురవుతున్న పిల్లలు
ఫీజు కట్టకపోతే అందరి ముందు పరువు తీసినట్టు నిలబెట్టడం, పరీక్ష హాల్లోంచి వెళ్లగొట్టడం, ఫీజు కట్టని వాళ్లందరినీ ఒక రూమ్ లో ఖాళీగా కూర్చోపెట్టడం.. వంటి ఘటనలు పిల్లలను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనిపై వారి పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల వేధింపులపై ఎంఈఓలు, డీఈఓలకు ఫిర్యాదులు చేసినా పెద్దగా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
ఎవ్వరికి చెప్పుకున్నా భయపడేది లేదని ప్రైవేటు స్కూల్ మేనేజ్ మెంట్ ధీమాగా చెప్తుండటం చూస్తుంటే విద్యాశాఖ అధికారులతో వారికి ఉన్న బంధం అర్థమవుతుందని చెప్తున్నారు. ఇప్పటికైనా ఫీజుల కోసం వేధిస్తూ, పరీక్షలు రాయనీయని మేనేజ్మెంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.