- గ్రేటర్ పరిధిలో ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం
- సెలవులపై జీవో ఇచ్చినా.. సర్కారు ఆదేశాలు బే ఖాతర్
- పదో తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు.. మిగతా వారికి ఆన్ లైన్ లో
- విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరవు
హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగకు సెలవులు ఇచ్చినట్టే ఇచ్చి ఆన్లైన్ క్లాసులు నడిపిస్తున్నాయి కొన్ని ప్రైవేటు స్కూళ్లు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి16 వరకు అన్ని విద్యా సంస్థలకు సంక్రాంతి హాలీడేస్ ప్రకటించింది. అయితే ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ఎప్పటిలాగే క్లాసులు నిర్వహిస్తున్నాయి. గ్రేటర్హైదరాబాద్పరిధిలోని చాలా స్కూళ్లు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.25 వరకు ఆన్లైన్లో 8 పీరియడ్లు కంప్లీట్ చేస్తున్నాయి. గూగుల్ మీట్ లో క్లాసులు జరుగుతాయని చెప్తూ కచ్చితంగా అటెండ్ కావాలని స్టూడెంట్స్పేరెంట్స్ఫోన్లకు టీచర్లు మెసేజ్‌లు పంపుతున్నారు.
పండుగకు సెలువులు ఇచ్చిన తర్వాత కూడా క్లాసులు నిర్వహిస్తుండటంపై చాలామంది తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లగా.. వారు తాజాగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేనకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో క్లాసులు అలాగే నడుస్తున్నాయి. బంజారాహిల్స్ కు చెందిన రెండు ప్రముఖ స్కూళ్లు, సఫిల్‌గూడకు చెందిన మరో పెద్ద స్కూలు సహా పలు ప్రైవేట్ బడులు సెలవుల్లోనూ ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాయని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వెంకట్ సాయినాథ్ తెలిపారు.
స్కూళ్లలో ఫిజికల్ క్లాసులు...
‘‘మీ బాబు టెన్త్ క్లాస్, రివిజన్ క్లాసులకు పంపించండి. లేకుంటే చాలా కష్టం. ఎగ్జామ్స్ లో ర్యాంక్ కొట్టాలంటే స్కూల్ కు రావాల్సిందే’’ అంటూ ఆయా స్కూళ్ల క్లాస్ టీచర్లు పేరెంట్స్ కు ఫోన్లు చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక చాలామంది తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపిస్తున్నారు. రివిజన్ క్లాసుల పేరుతో సెలవుల్లోనూ పిల్లలను నేరుగా స్కూళ్లకు రమ్మని క్లాసులు కొనసాగిస్తున్నాయి. పిల్లల క్లాసుల కోసమే చాలా మంది పేరెంట్స్ పండుగకు సొంతూర్లకు వెళ్లకుండా సిటీలోనే ఉండిపోయారు.
ఇష్టమొచ్చినట్లుగా..
గవర్నమెంట్ ఆదేశాలను కొన్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లు అస్సలు పట్టించుకోవడంలేదు. అధికారులు కూడా చూసి చూడనట్టుగానే ఉంటున్నారు. సెలవుల్లో క్లాసులు వద్దని పేరెంట్స్కోరుతున్నా.. కచ్చితంగా అటెండ్ కావాల్సిందే అని స్కూళ్లయాజమాన్యాలు తేల్చిచెప్తున్నాయి. కొన్ని స్కూళ్లు ఏకంగా ఫిజికల్ క్లాసులే రన్ చేస్తున్నాయి. రూల్స్ కువిరుద్ధంగా వ్యవహరించినా ఆఫీసర్లు పట్టించుకునే స్థితిలో లేరు. - వెంకట్ సాయినాథ్, సెక్రటరీ, హెచ్ఎస్‌పీఏ
పండక్కి ఊరికి పోలే
మా అమ్మాయి సఫిల్‌గూడలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతోంది. మొన్న ఎనిమిదో తారీఖు నుంచి గవర్నమెంట్ పిల్లలకు సంక్రాంతి సెలవులు డిక్లేర్ చేసింది. చాలారోజుల తర్వాత పండుగకి ఊరెళ్దామని అనుకున్నాం. కానీ పదో తారీఖు నుంచి 12వరకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయని స్కూల్మేనేజ్మెంట్ మెసేజ్ పంపింది. తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఊరికి వెళ్లకుండా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. - మాధురి, పేరెంట్, సఫిల్ గూడ