సుప్రీం తీర్పుతోనైనా ప్రైవేట్​ స్కూళ్లు దారికి రావాలె

సుప్రీం తీర్పుతోనైనా ప్రైవేట్​ స్కూళ్లు దారికి రావాలె

ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల సమస్య అనేక రాష్ట్రాల్లో ఆందోళనకర అంశంగా మారింది. కరోనా విపత్తు నేపథ్యంలో అది మరింత తీవ్రమైంది. స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. న్యాయస్థానాల్లో కేసుల పాలైనా అవి నిలదొక్కుకుని కొంత మేరకు అమలు జరుగుతున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో ఫీజుల భారాన్ని తగ్గించడానికి ఇచ్చిన ఉత్తర్వులను తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు స్కూళ్ల మేనేజ్​మెంట్లు ఖాతరు చేయడం లేదు. ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా అమలు చేయడానికి ఒత్తిడి చేసిన రాష్ట్రాల్లో ప్రైవేటు యాజమాన్యాలు కోర్టుల్లో సవాల్ చేస్తున్నవి. వాటిలో రాజస్థాన్ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫీజుల సమస్యకు కొంత ఉపశమనం కలిగించేలా ఉన్నది. అది అన్ని రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణకు తోడ్పడే అవకాశం ఉంది. ఆ తీర్పులో రెండు భాగాలు ఉన్నవి. ఒకటి, ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించే అధికారం రాజ్యాంగబద్ధమే అని చెప్పడం. రెండు, విపత్తు సమయంలో ఆదాయ వ్యయాల లెక్కలతో నిమిత్తం లేకుండా మానవతా దృక్ఫథంతో అయినా ఫీజులను ఎంతో కొంత తగ్గించాలని చెప్పడం.

‘‘సంక్షేమ రాజ్యంలో ప్రాధాన్యత గల విద్యాభివృద్ధి బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలపైనా ఉన్నది. విద్యా వ్యాప్తి కోసం ప్రైవేట్ సంస్థలు చేస్తున్న కృషిని అభినందించాల్సిందే. నాణ్యమైన విద్యను అందించడానికి తగిన ఫీజును నిర్ణయించే హక్కు స్కూల్ యాజమాన్యాలకు ఉంటుందనే వాదన సరైనదే. కానీ దానిని లాభార్జనకు, వ్యాపారానికి దోహదం చేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అది ఆర్టికల్ 19(1)(జీ)కి విరుద్ధం కానేకాదు. అధిక ఫీజులను అరికట్టే అధికారం రాజ్యాంగబద్ధమే. రాజ్యాంగ ఆదేశం ప్రకారం ఉచితంగా అందించాల్సిన విద్య కోసం ఫీజుల భారాన్ని మోపే హక్కు యాజమాన్యాలకు లేదు. విద్యతో లాభార్జన, వ్యాపారం చేయడానికి వీల్లేదని వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తించాలి. ప్రైవేట్ పరిశ్రమలకు, సర్వీస్ సంస్థలకు(టెలికాం, ఇన్సూరెన్స్, విద్యుత్ వగైరా) రెగ్యులేషన్ ఉండగా భావి తరాలను తీర్చిదిద్దాల్సిన విద్యా సంస్థలకు రెగ్యులేషన్ చట్టం వద్దని సవాల్ చేయడం సరైంది కాదు. రాజస్థాన్ చట్టం 2016 ప్రకారం అభివృద్ధికి అవసరమైన రెవెన్యూ మిగులు సహా స్కూళ్ల నిర్వహణకు అయిన వాస్తవ ఖర్చుల ఆధారంగా యాజమాన్యం ఫీజు ప్రతిపాదన చేయాలి. అది సహేతుకంగా ఉంటే 'స్కూల్ లెవెల్ ఫీ కమిటీ' ఆమోదిస్తుంది. లేకపోతే తగ్గించాలని తిరస్కరించవచ్చు. కమిటీ చెప్పినా ఫీజు తగ్గించదల్చుకోని యాజమాన్యం 'డివిజనల్ ఫీ రెగ్యులేషన్ కమిటీ(డీఎఫ్ఆర్సీ)కి, ఆపై 'రివిజన్ కమిటీ'కి అప్పీల్ చేసుకోవచ్చు. అవి చేసే నిర్ణయాలను మాత్రం అమలు చేయాలి. ఎస్ఎల్ఎఫ్సీ, డీఎఫ్ఆర్సీ, రివిజన్ కమిటీ అన్నీ చట్టబద్ధమైన సంస్థలే అనే విషయాన్ని యాజమాన్యాలు గుర్తించాలి. కనుక రాజస్థాన్ చట్టంలోని నిబంధనలు, నియమాలను వ్యతిరేకించడం చెల్లదు. కేంద్రం చేసిన విద్యా హక్కు చట్టం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయకూడదనే అభ్యంతరం సరైంది కాదు” అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నియంత్రించే చట్టాన్ని, దానిని సమర్థిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలనే యాజమాన్యాల అప్పీల్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

ట్యూషన్​ ఫీజుల్లో 15 శాతం తగ్గించాలి
కరోనా విపత్తు నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారం సమస్యపై కూడా సుప్రీంకోర్టు సహేతుకమైన తీర్పే చెప్పింది. రాజస్థాన్ లో లాక్ డౌన్ వల్ల 2020 మార్చి నుంచి మూడు నెలలు స్కూళ్లు పని చేయని కాలానికి ప్రభుత్వ ఆదేశాలతో చెల్లించని ఫీజులను, స్కూళ్లు తెరిచిన తర్వాత మూడు వాయిదాల్లో చెల్లించాలని చెప్పింది. "ఆన్​లైన్​ క్లాసులకు సీబీఎస్ఈ సిలబస్​ను 70 శాతానికి పరిమితం చేసినందున ఆ స్కూళ్లలో ఫీజులు కూడా 70% తీసుకోవాలి. రాష్ట్ర బడుల్లో సిలబస్​ను 60 శాతానికే నిర్ణయించినందున ఫీజులు కూడా ఆ మేరకే తీసుకోవాలి’’ అని రాజస్థాన్ విద్యా శాఖ 2020 అక్టోబర్ 28న ఇచ్చిన ఉత్తర్వులను కొంత సవరించాలని చెప్పింది. ఆన్​లైన్​ క్లాసుల రోజుల్లో లైబ్రరీ, లేబోరేటరీ, కో-కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ తదితర వసతులను స్టూడెంట్లు వాడుకునే అవకాశం లేనందున వాటికి అయ్యే ఖర్చులతో పాటు బోర్డింగ్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు తీసుకోకూడదని, ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని సూచించింది. దీంతో 2019–-20 విద్యా సంవత్సరానికి 'స్కూల్ లెవెల్ ఫీ కమిటీ' లు నిర్ణయించిన ట్యూషన్ ఫీజుల్లో 15 శాతం చొప్పున తగ్గించి 2020–-21 విద్యా సంవత్సరానికి తీసుకోవాలని చెప్పింది. వాస్తవంగా తగ్గిన  ఖర్చుల మేరకు స్కూల్ లెవెల్ ఫీ కమిటీలే ఫీజులను తిరిగి నిర్ణయించాలని ఆదేశించాల్సి ఉందని, కానీ కరోనా నేపథ్యంలో  స్కూల్​ అకౌంట్స్ పరిశీలించి ఫీజులు పునర్నిర్ణయించడానికి చాలా రోజులు పడుతుందని, అందువలన మధ్యేమార్గంగా అన్ని స్కూళ్లకు ఒకే విధంగా 15% చొప్పున తగ్గిస్తే సరిపోతుందని చెప్పింది. ఫీజులు చెల్లించలేని వారి అభ్యర్థనలను 'పేరెంట్-టీచర్స్ అసోసియేషన్' ద్వారా ఓ కమిటీ వేసి పరిశీలన చేయించి అవసరమైన వారికి మినహాయింపు ఇవ్వాలని, ఫీజు కట్టలేదనే కారణంగా ఏ ఒక్క స్టూడెంట్ ను పరీక్షలకు అనుమతించకపోవడం, టీసీలు ఇవ్వకపోవడం వంటి చర్యలకు పాల్పడవద్దని యాజమాన్యాలను సుప్రీంకోర్టు హెచ్చరించింది.

స్పష్టమైన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
రాజస్థాన్ స్కూల్స్(రెగ్యులేషన్ ఆఫ్ ఫీ) యాక్ట్–2016లోని కొన్ని సెక్షన్లు, రాజస్థాన్ స్కూల్స్(రెగ్యులేషన్ ఆఫ్ ఫీ) రూల్స్–2017లోని కొన్ని రూల్స్ ‘‘దేశ పౌరులందరికీ, ఏదైనా వృత్తి చేపట్టడానికి లేదా వ్యాపారం లేదా వర్తకం కొనసాగించడానికి హక్కు కల్పించిన ఆర్టికల్ 19(1)(జి)కి భంగం కలిగిస్తున్నాయి’’ అని రాజస్థాన్ ప్రైవేటు స్కూళ్ల మేనేజ్​మెంట్లు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశాయి. ఫీజు నిర్ణయించే అధికారాన్ని 'స్కూల్ లెవెల్ ఫీ కమిటీ'కి అప్పగించి యాజమాన్యాల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీశారని వాదించాయి. స్కూల్ లెవెల్ ఫీ కమిటీలో ఉండే(సగం) ఐదుగురు తల్లిదండ్రుల ప్రతినిధులకు నాణ్యమైన విద్య కోసం స్కూళ్లను అభివృద్ధి చేసే విషయంపై అవగాహన ఉండదని తెలిపాయి. విద్యాహక్కు చట్టంలో క్యాపిటేషన్ ఫీజుపై నిషేధం విధించారే తప్ప ఇతర ఫీజుల గురించి ఏమీ చెప్పలేదని పేర్కొన్నాయి. ఫీజుల నిర్ణయం సహా అన్ని విషయాల్లో  విద్యాసంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని టీఎంఏ పాయ్ ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్నాటక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యాజమాన్యాలు గుర్తు చేశాయి. తల్లిదండ్రుల తరఫు వాదనలు, రాజస్థాన్ ప్రభుత్వ వివరణలు విన్న ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చింది.

అన్ని రాష్ట్రాలకు పనికొచ్చే తీర్పు ఇది
ప్రైవేటు స్కూళ్ల ఫీజులు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజస్థాన్ కు సంబంధించిందే అయినా, ఏ రాష్ట్రంలో అయినా ఫీజుల నియంత్రణకు చేపట్టే చర్యలకు ఉపయోగపడుతుంది. ఫీజుల నియంత్రణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని యాజమాన్యాలు చేసే వాదనలను నిరోధించడానికి తోడ్పడుతుంది. అధిక ఫీజులు అరికట్టాలని తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమాలకు ఉత్సాహాన్నిస్తుంది. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలనే ప్రయత్నాలకు ఊతమిస్తుంది. ప్రభుత్వం నేరుగా ఫీజులను నిర్ణయించకుండా 'స్కూల్ లెవెల్ ఫీ కమిటీ'ల చేత నిర్ణయింపచేసే ప్రజాస్వామిక పద్ధతి గల రాజస్థాన్ చట్టం ఇతర రాష్ట్రాలకు మోడల్ గా నిలుస్తుంది. డిజాస్టర్ మేనేజ్​మెంట్ చట్టం మేరకు కరోనా కష్టకాలంలో స్కూల్ ఫీజుల భారాన్ని తగ్గించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని ఈ తీర్పులో వివరించడం మరింత ఉపయోగకరం. ఛారిటీ సంస్థలుగా ఉండాల్సిన ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల విషయంలో ముఖ్యంగా ఉచితంగా అందించాల్సిన స్కూల్​ విద్య ఫీజుల విషయంలో ఉదారంగా ప్రవర్తించాలని, తల్లిదండ్రుల పట్ల సానుభూతిగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు చేసిన సూచన చాలా బాగుంది.

- నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త