జగన్ తాడేపల్లి ఇంటికి ప్రైవేట్ సెక్యూరిటీ

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలోని ఇంటి దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఇంటి ఎదుట ఆక్రమణల తొలగింపు తర్వాత.. తాడేపల్లిలోని ఇంటి విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంటికి సైతం ఏపీ సర్కార్ సెక్యూరిటీ ఇచ్చింది. అదే విధంగా తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసుగా ఉన్న ఇంటికి కూడా ప్రభుత్వ సెక్యూరిటీ ఉండేది. జగన్ ఓడిపోయిన తర్వాత.. ఆ సెక్యూరిటీని తగ్గించింది. జగన్ ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కావటం.. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవటంతో.. నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేకు ఉండాల్సిన భద్రతను మాత్రమే ఇస్తుంది ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. 

ఈ క్రమంలోనే తాడేపల్లిలోని ఇంటి దగ్గర భద్రత కోసం ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన 30 మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు 2024, జూన్ 17వ తేదీ ఉదయం.. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది.. తాడేపల్లిలోని జగన్ ఇంట్లోకి వెళుతున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని జాతీయ పత్రిక ప్రతినిధి ఎక్స్ లో పోస్టు చేయటంతో వెలుగులోకి వచ్చింది.

ఇప్పటికే విజయవాడ తాడేపల్లిలోని జగన్ ఇంటి  ఎదుట ఉన్న రోడ్డుపై రాకపోకలను పునరుద్ధరించటం జరిగింది. అదే విధంగా సీఎంగా ఉన్నప్పుడు ఉన్న సెక్యూరిటీని తగ్గించటం జరిగింది. దీంతో తన భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకుంటున్నారు జగన్.