వరంగల్ క్రైం, వెలుగు: మానసిక వ్యాధితో బాధ పడుతున్న ఓ ప్రైవేట్టీచర్తన కొడుకుతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..హనుమకొండ కనుకదుర్గ కాలనీకి చెందిన శీలమంతుల రవీందర్(38) నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో మ్యాథ్స్ టీచర్. ఈయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీచరణ్(8) అదే స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. రవీందర్ దాదాపు రెండేండ్ల నుంచి మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు.
ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో మూడు రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం స్కూల్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తన కొడుకు శ్రీచరణ్ని తీసుకుని బయటకు వెళ్లాడు. స్కూల్ టైం ముగిసినా ఇంటికి రాకపోవడంతో రవీందర్ కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవీందర్ బైక్ పెద్ద వడ్డేపల్లి చెరువు దగ్గర కనిపించడంతో స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు చెరువు పరిసర ప్రాంతాల్లో గాలించగా ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చి కనిపించాయి. మృతుడు రవీందర్ భార్య దివ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సుబేదారి పోలీసులు తెలిపారు.