ఆన్​లైన్​ బెట్టింగ్​తో అప్పుల పాలు.. చైన్ స్నాచింగ్​ బాట పట్టిన ప్రైవేట్ ​టీచర్

ఆన్​లైన్​ బెట్టింగ్​తో అప్పుల పాలు.. చైన్ స్నాచింగ్​ బాట పట్టిన ప్రైవేట్ ​టీచర్

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆన్​లైన్​బెట్టింగ్​తో అప్పుల పాలైన ఓ ప్రైవేట్ టీచర్ చైన్​స్నాచింగ్స్ కు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం వద్దిపట్లకు చెందిన బొంత అనిల్ ఎమ్మెస్సీ పూర్తిచేశాడు. చంపాపేటలో ఉంటూ ప్రైవేటుగా ట్యూషన్లు చెబుతున్నాడు. ఆన్​లైన్​బెట్టింగ్ కు అలవాటుపడిన అనిల్​లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నాడు. రూ.3లక్షల వరకు అప్పులు చేశాడు.

వాటిని తీర్చేందుకు కొన్ని రోజుల కింద పహాడీషరీఫ్ లోని ఓ మహిళ మెడలోని పుస్తెలతాడు చోరీ చేశాడు. వారం కింద ఇబ్రహీంపట్నం శేరిగూడలో పశువులు మేపుతున్న భారతమ్మ మెడలోని పుస్తెల తాడు గుంజుకుని పారిపోయాడు. సోమవారం మంగల్ పల్లి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనిల్​అనుమానంగా కనిపించడంతో విచారించగా చోరీలు బయటపడ్డాయి. 7 తులాల బరువున్న రెండు పుస్తెల తాడులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండుకు తరలించినట్లు ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఎస్సై నాగరాజు తెలిపారు.