ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రైవేట్ టీచర్ల ఓట్లే కీలకం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రైవేట్ టీచర్ల ఓట్లే కీలకం
  • తొలిసారిగా అవకాశమిచ్చిన ఎలక్షన్‌‌ కమిషన్‌‌
  • రెండు టీచర్‌‌ నియోజకవర్గాల్లో ఐదు వేల చొప్పున ఓట్లు
  • ఇప్పటివరకు ప్రభుత్వ టీచర్లు కేంద్రంగానే ఎన్నికల ప్రచారం
  • తమ డిమాండ్లపైనా ఎమ్మెల్సీ క్యాండిడేట్లు గొంతు విప్పాలంటున్న ప్రైవేట్‌‌ టీచర్లు

కరీంనగర్, వెలుగు :మెదక్, కరీంనగర్, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ, వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేట్‌‌ టీచర్లు, లెక్చరర్ల ఓట్లు కీలకంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ప్రైవేట్‌‌ స్కూల్‌‌ టీచర్లకు సైతం ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. దీంతో ఆయా స్కూల్‌‌ యాజమాన్యాలు తమ పాఠశాలల్లో పని చేసే టీచర్ల పేర్లు, వివరాలతో ఓటు హక్కు కోసం అప్లై చేశాయి. 

ఫస్ట్‌‌ కావడంతో పలు అభ్యంతరాలతో చాలా అప్లికేషన్లను ఆఫీసర్లు రిజెక్ట్‌‌ చేసినప్పటికీ, రెండు నియోజకవర్గాల్లోనూ సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల చొప్పున ఓటర్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తం ఓటర్లలో ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లే సుమారు 20 శాతం మేర ఉన్నారు. దీంతో తమ డిమాండ్లను కూడా ఎమ్మెల్సీ క్యాండిడేట్లు పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

రెండు నియోజకవర్గాల్లో పెరిగిన ఓటర్లు

2019లో జరిగిన వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న 20,888 మంది టీచర్లు ఎన్‌‌రోల్‌‌ చేసుకున్నారు. అయితే ఈ సారి నమోదు చేసుకున్న టీచర్‌‌ ఓటర్ల సంఖ్య 25,797కు చేరింది. 

అలాగే మెదక్, కరీంనగర్, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌ టీచర్‌‌ ఎమ్మెల్సీ స్థానంలో గతంలో 23,214 మంది ప్రభుత్వ టీచర్లు ఎన్‌‌రోల్‌‌ చేసుకోగా, ఈ సారి 27,088 మంది నమోదయ్యారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పెరిగిన వారిలో మెజార్టీ ఓటర్లు ప్రైవేట్ స్కూల్ టీచర్లు, లెక్చరర్లేనని తెలుస్తోంది.   

హెల్త్ కార్డులు, కనీస వేతనాల కోసం డిమాండ్

ఇప్పటివరకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయిన్ లో అభ్యర్థులంతా ప్రభుత్వ టీచర్లు, లెక్చరర్ల సమస్యలనే కేంద్రంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రైవేట్‌‌ టీచర్లు, లెక్చరర్ల సమస్యలు చర్చకు రాకుండాపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రధాన సంఘాలు, పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ తమ సమస్యలను ప్రస్తావించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు తమకు కూడా ఓటు హక్కు కల్పించడంతో తమ సమస్యలను క్యాండిడేట్ల ముందుంచుతున్నారు. రైతులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్లుగానే తమకు కూడా బీమా సౌకర్యం కల్పించాలని, హెల్త్‌‌ కార్డులు ఇవ్వాలని, కనీస వేతనాలు అందేలా చూడాలని ప్రైవేట్‌‌ స్కూల్‌‌ టీచర్లు, కాలేజీల లెక్చరర్లు కోరుతున్నారు. తమ సమస్యలపై మాట్లాడేవాళ్లకే ఓటేస్తామని స్పష్టం చేస్తున్నారు.

మా గురించి పట్టించుకోండి 

గ్రాడ్యుయేట్స్‌‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్యాండిడేట్లు ప్రైవేట్‌‌ విద్యాసంస్థల్లో పని చేసే టీచర్లు, లెక్చరర్ల సమస్యలను కనీసం ప్రస్తావించకపోవడం బాధాకరం. చాలీచాలని జీతాలతో పని చేస్తున్న మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు హెల్త్‌‌ కార్డులు జారీ చేయాలి. 1987 లెక్చరర్స్‌‌ ప్రొటెక్షన్‌‌ యాక్ట్‌‌ను పునరుద్ధరించాలి. వంగపల్లి రాజేశ్వర్, కన్వీనర్, తెలంగాణ ప్రైవేట్‌‌ లెక్చరర్స్‌‌ జేఏసీ