మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లైఓవర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. వెహికల్ టైరు పేలి ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు 26 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఏపీలోని నెల్లూరు బయలుదేరింది. మిర్యాలగూడ శివారులోని హనుమాన్ పేట ఫ్లైఓవర్ సమీపంలో బస్సు వెనక టైరు పేలిపోవడంతో మంటలు చెలరేగాయి.
ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ప్యాసింజర్లు అందరూ కిందికి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకునేలోపే బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే, అదే సమయంలో పక్కనే ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీపై మంటలు పడడంతో లారీ టర్పాలిన్ కూ మంటలు అంటుకున్నాయి. గమనించిన లారీ డ్రైవర్ టార్ఫాలిన్ పట్టాను తొలగించాడు. మరో ప్రమాదం తప్పిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.