ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అంటే ఇదీ : టికెట్ 5 వేల రూపాయలా..!

సంక్రాంతి పండగ అంటే పండగలా ఉండాలి కానీ.. ఏడుపు తెప్పించేలా ఉండకూడదు.. ఈసారి మాత్రం సంక్రాంతి పండక్కి ఊరెళ్లాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా వాళ్లు అప్పు చేయాల్సిందే.. ఎందుకు అంటారా.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ ఆ మాదిరిగా ఉంది.. వేలకు వేల రూపాయలు పెంచేశారు. మామూలు రోజుల్లో వెయ్యి రూపాయలు ఉండే టికెట్.. ఇప్పుడు ఏకంగా 5 వేల రూపాయలకు చేరింది. హైదరాబాద్ నుంచి ఒంగోలు.. జస్ట్ 350 కిలోమీటర్లు.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టికెట్ ఎంతో తెలుసా.. అక్షరాల 5 వేల రూపాయలు.. ఏంటీ నమ్మటం లేదా.. ఓసారి ట్రావెల్స్ వెబ్ సైట్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది.. కళ్లు బైర్లు కమ్ముతాయి.. నోరెళ్లబెడతారు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఏపీ, తెలంగాణలో జరుపుకునే ప్రతిష్టాత్మక పండుగల్లో ఒకటైన సంక్రాంతి ఫెస్టివల్‎ను కుటుంబ సమేతంగా జరుపుకునేందుకు జనం సొంతూళ్ల బాట పట్టారు. 2025, జనవరి 11వ తేదీ నుండి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు ప్రభుత్వాలు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు సైతం ఇళ్లకు వెళ్తున్నారు. ఒక వైపు విద్యార్థులు.. మరో వైపు ఉద్యోగుల హడావుడితో రోడ్లపై పండుగ జోష్ నెలకొంది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగను ‘క్యాష్’ చేసుకోవడానికి ప్రైవేట్ ట్రావెల్స్ భారీ దందాకు తెరలేపాయి. పండుగకు సొంతూళ్లకు వెళ్లే  ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని బస్ టికెట్ రేట్లను కళ్లు బైర్లు కమ్మే రీతిలో పెంచేశాయి. పండక్కి వెళ్లాలనుకునే వారికి టికెట్ రేట్ చూస్తేనే గుండె దడ వచ్చేలా పెంచేశారు ధరలు. 

ఇక, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి వంటి ప్రముఖ నగరాలకు వేళ్లే మార్గాల్లో అయితే టిక్కెట్ ధరలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయంటున్నారు ప్రయాణికులు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు ఏసీ బస్సు చార్జీలు రూ.1,000 నుంచి రూ.1,800 వరకు ఉంటే.. తాజాగా రూ.4,000 నుంచి రూ.5,000 వరకు హైక్ చేశారు బస్ టికెట్ రేట్స్. కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగ చేసుకుందామనుకున్న వారు ఈ టికెట్ రేట్లు చూసి జంకుతున్నారు. ఇంత ధరలు పెట్టి జేబులు గుళ్ల చేసుకోని ఇంటికి వెళ్లడం అవసరమా అని కొందరు పునరాలోచనలో పడేలా చేశారు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానులు. 

ALSO READ | కేంద్రం గుడ్ న్యూస్: తెలంగాణకు రూ.3,637 కోట్లు

ప్రైవేట్ ట్రావెల్స్ పెంచిన ఒక టికెట్ రేటుతో.. ఒక ఫ్యామిలీకి పండుగ మొత్తం ఖర్చు అయిపోతుందని వాపోతున్నారు. మాములు రోజుల్లో వేయి రూపాలు ఉండే టికెట్ రేట్ పండగ సీజన్ కాబట్టి పెంచిన మా అంటే ఓ 100, 200 రూపాయలు పెంచాలి కానీ.. ఏకంగా వేలకు వేలు పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లను భారీగా పెంచడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ప్రభుత్వం స్పందించి టికెట్ ధరలను తగ్గించాలని కోరుతున్నారు సామాన్య జనం. పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసిన అందులో ప్రయాణించడం ఛాలెజింగ్‎గా మారిపోయింది. 

ఇసుక వేస్తే రాలనంతా జనంతో ఫుల్ ప్యాక్ అయ్యి బస్సులు వెళ్తున్నాయి. ఆ సాహసం చేయలేక ప్రైవేట్ ట్రావెల్స్ వైపు చూస్తే.. వాళ్లు పెంచిన టికెట్ ధరలు చూసి గుండె ఆగిపోయే అంతా పని అయితోంది. దీంతో పండుక్కి ఆనందంగా ఇంటికి వెళ్దామనుకున్న వారికి ‘జర్నీ’ సవాల్‎గా మారింది. ఆర్టీసీకి  సమానంగానే ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లు ఉండాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వారు అవేవి పట్టించుకోవడం లేదు. ఆ రూల్స్ తమకు కాదన్నట్లు భారీగా టికెట్ రేట్లు పెంచేశారు.  దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ప్రభుత్వం స్పందించి టికెట్ ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు. మరీ ఆకాశనంటుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధరలపై ప్రభుత్వం స్పందించి ఏమైనా యాక్షన్ తీసుకుని జనానికి ఉపశమనం కల్పిస్తుందా..? లేదా చూసి చూడనట్లు వదిలేసి జనం జేబులు గుళ్ల  అయ్యేలా చేస్తుందా చూడాలి మరీ.