
- యాక్సిడెంట్లతో భయాందోళనలో జనం
- బషీర్‌బాగ్‌లో దంపతులను ఢీకొన్న బస్సు, ఒకరు మృతి
- వార్తలు వచ్చినప్పుడే ఆర్టీఏ, పోలీసుల యాక్షన్
హైదరాబాద్‌సిటీ, వెలుగు:
మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో మహానగరంలో ప్రైవేట్ట్రావెల్ బస్సులు జనాల ఉసురు తీస్తున్నాయి. తాజాగా బషీర్‌బాగ్‌లో సోమవారం ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు రాంగ్ రూట్లో దూసుకొచ్చి ఢీ కొట్టడంతో టూ వీలర్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ భర్త చనిపోగా, భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నగరంలో ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడు సర్వ సాధారణమైపోయాయి.
సిటీలో ఆర్టీసీ బస్సులతో సమానంగా ట్రావెల్స్ బస్సులు రోడ్లపై తిరుగుతూ ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తున్నాయి. నిజానికి బయటి ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉదయం 7గంటల్లోపే నగరంలోకి ప్రవేశించాలి. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రాత్రి 10గంటల తర్వాతే రోడ్డెక్కాలి. ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్లు, డ్రైవర్లు ఈ రూల్స్పాటించినట్టు ఎక్కడా కనిపించదు. ట్రాఫిక్ పోలీసులు గానీ, ఆర్టీఏ ఆఫీసర్లు కానీ, చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా అరుదే. పత్రికల్లో వార్తలు పబ్లిష్ అయినప్పుడు రెండు మూడు బస్సుల్లో తనిఖీలు చేయడం, సీజ్ చేయడం కామన్ అయిపోయింది.
ఓవర్ స్పీడే ప్రధాన కారణం..
రాను రాను ప్రైవేట్ట్రావెల్స్వల్ల జరిగే ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీనికి ట్రావెల్స్మధ్య పోటీతత్వంతో త్వరగా చేరుకోవాలని ఓవర్‌స్పీడ్‌తో వెళ్లడం ఒక కారణమైతే, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్‌టైం డ్యూటీలు, బస్సులు, డ్రైవర్లు ఫిట్‌గా లేకపోవడంఇతర కారణాలు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో బస్సుల స్పీడ్, హారన్ మోతలతో సిటీ దద్దరిల్లుతూనే ఉంటుంది. కొన్ని బస్సులైతే వెనకే వచ్చి బ్రేక్ కొట్టేంతవరకు కూడా బస్సు వచ్చినట్టు తెలియదు. బస్సుల ఫిట్నెస్తో పాటు బస్సును నడిపే డ్రైవర్లు కూడా ఫిట్‌గా ఉండాలని ఆర్టీఏ రూల్స్చెప్తున్నాయి. 60 ఏండ్లు పైబడిన వారు బస్సులు నడపరాదన్న నిబంధన ఉన్నా కొందరు ట్రావెల్స్యజమానులు ఎక్స్పీరియన్సుడ్డ్రైవర్స్అంటూ వారిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
అలాగే డ్రైవర్లు షిప్టుల వారీగా డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రాత్రి ప్రయాణం చేసే బస్సులో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలన్న రూల్‌ను చాలా తక్కువ ట్రావెల్స్పాటిస్తున్నాయి. రాత్రి బయలుదేరుతున్న చాలా బస్సుల్లో వెళ్లేప్పడు ఉన్న డ్రైవరే.. తిరిగి వచ్చేప్పుడు కూడా డ్రైవింగ్చేసుకుంటూ వస్తున్నాడు. ట్రావెల్స్ఓనర్లు చెప్పిన టైంకు డెస్టినేషన్‌కు చేరుకోవాలని బస్సులను ఓవర్ స్పీడ్‌తో నడుపుతున్నారు. డ్రైవర్లు అలసిపోయినా, ఆకలేసినా టైంకు రావాల్సిందేనన్న కండీషన్లు పెడుతున్నారు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ విషయంలో పోలీసులు, ఆర్టీఏ అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తే తప్ప ప్రమాదాలు తగ్గే అవకాశం కనిపించడం లేదు.
రాంగ్ రూట్లో దూసుకొచ్చిన బస్సు
బషీర్ బాగ్, వెలుగు: రాంగ్రూట్లో వచ్చిన ప్రైవేటు ట్రావెల్బస్సును బైక్ ఢీకొని ఒకరు మృతి చెందగా, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. లాలాగూడకు చెందిన సంతా జసంత అబిడ్స్ చాపెల్ రోడ్ లోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నది. సోమవారం ఉదయం స్కూల్ వద్ద వదిలేందుకు ఆమెను భర్త ఆడోమ్ క్యారమ్ (67) బైక్‌పై తీసుకొని బషీర్ బాగ్ చౌరస్తా మీదుగా బయలుదేరాడు. మార్గమధ్యలో ఎల్బీ స్టేడియం వద్ద ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అతివేగంగా రాంగ్ రూట్లో వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడగా, సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆడోమ్ క్యారమ్ మృతి చెందగా, అతని భార్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. జసంత కొడుకు క్రిస్టోపర్ క్యారమ్ ఇచ్చిన ఫిర్యాదుతో డ్రైవర్ పై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును సీజ్ చేశారు.
గతేడాది జరిగిన ప్రమాదాలు ఇవీ....
అక్టోబరు 30న జీడిమెట్లలోని షాపూర్ చౌరస్తాలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణమైంది.
నవంబరు 9న బళ్లారి నుంచి హైదరాబాద్ వస్తున్న గో టూర్ ట్రావెల్స్ బస్సు ఓవర్‌స్పీడ్‌తో ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్ వద్ద అదుపుతప్పి కారును ఢీకొట్టింది. అదే వేగంతో కారును ఈడ్చుకుంటూ వెళ్లింది. కారు డ్రైవర్ కారులో నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
డిసెంబర్20న పంజాగుట్టలో టూవీలర్‌పై వెళ్తున్న ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్‌ను ప్రైవేట్ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో కాలేజీకి వెళ్తున్న పై లోకేష్ (20) అక్కడికక్కడే చనిపోగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
జూన్ 10న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ఆరాంఘర్ చౌరస్తాలో ప్రైవేట్ట్రావెల్స్బస్సు ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి బస్సు టైర్ల కింద పడి చనిపోయాడు.
మే 26న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ఎగ్జిట్ నంబర్17 దగ్గర ఓవర్‌స్పీడ్‌తో ఉన్న ప్రైవేట్ట్రావెల్స్బస్సు టైర్ పేలడంతో బోల్తా పడింది. ముందు వెళ్తున్న ఇటుకల వాహనాన్ని తప్పించబోయి కారును తాకుతూ డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదసమయంలో 30 మంది బస్సులో ఉండగా, ఇందులో కొంతమంది గాయపడ్డారు.