దేశం కోసం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను నేషనలైజ్ చేస్తే.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బ్యాంకులతో పాటు అనేక సెక్టార్లను ప్రైవేటైజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. నష్టాల్లో ఉన్న సంస్థల్లోకి పెట్టుబడులు పెంచో.. మేనేజ్‌మెంట్‌ను మార్చో గట్టెక్కించవచ్చు. కానీ, వాటిని అమ్మకానికి పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. వీటినే కాదు నవరత్న స్టేటస్ కలిగి లాభాల్లో నడుస్తున్న కంపెనీలను కూడా ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు చేస్తోంది.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటైజేషన్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పబ్లిక్ సెక్టార్‌ను దెబ్బతీసి ప్రైవేట్ సెక్టార్‌కు ఎక్కువ స్పేస్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇండియా సొంత కాళ్లపై నిలబడాలన్న నెహ్రూవియన్ విజన్‌ను రీప్లేస్ చేసేందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తోంది. నెహ్రూవియన్ మోడల్‌నే సాధారణంగా మిక్స్‌డ్ ఎకానమీ మోడల్‌గా పిలుస్తారు. ఈ పద్ధతిలో పబ్లిక్ సెక్టార్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ప్రైవేట్ సెక్టార్‌కు కూడా అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం మోడీ సర్కార్ లాభాల్లో ఉన్న పబ్లిక్ సెక్టార్ యూనిట్(పీఎస్‌యూ)లను కూడా పెట్టుబడుల ఉపసంహరణ లిస్ట్‌లో చేర్చింది. ఇందులో నవరత్న స్టేటస్ ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి.
బీజేపీ సర్కార్ ఐడియాలజీనే ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహించడం. అందువల్ల పబ్లిక్ సెక్టార్ యూనిట్లను రీస్ట్రక్చరింగ్ చేసే ప్రశ్నే తలెత్తడం లేదు. నష్టాలు వస్తున్నాయనేది ఒక్కటే పీఎస్‌యూల అమ్మకానికి కారణం కాదు. నష్టాలు వచ్చే కంపెనీలను కూడా లాభాల బాట పట్టించే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం అదనపు క్యాపిటల్‌ను అందించడమో లేదా మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేయడమో చేయాలి. ఇలా చేస్తే నష్టాలు తగ్గి మళ్లీ ఆ కంపెనీలు లాభాలబాట పట్టవచ్చు. అంతేకానీ కొంత వాటా అమ్మకం లేదా పూర్తిగా అమ్మేయడం పరిష్కార మార్గం కానేకాదు. ప్రస్తుతం కేంద్రం అమ్మకానికి పెడుతున్న సంస్థలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఏర్పాటు చేసినవే. వీటికి సరైన విలువ కట్టకుండా తక్కువ రేటుకు అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎయిరిండియా దేశ గౌరవానికి చిహ్నం. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ ప్రభుత్వ అధీనంలో లేనట్లయితే భారత బలగాలు అంత సులువుగా అక్కడికి చేరుకోలేవు. 1948 అక్టోబర్ 26న పాకిస్థాన్ పాల్పడిన ఎటాక్స్ లాంటి వాటిని త్వరగా ఎదుర్కోలేం. 1971లో ఇండియా, వార్ టైంలో మన ఎయిర్ ఫోర్స్ తమ ఫ్లైట్స్‌కు కావాల్సిన ఏవియేషన్ ఫ్యూయల్ కోసం ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీని వల్లే ఆ తర్వాత ఇందిరాగాంధీ కాల్టెక్స్, ఎస్సో, బర్మాషెల్ వంటి కంపెనీలను నేషనలైజ్ చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్
పబ్లిక్ సెక్టార్‌లో ఏర్పాటైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ నెహ్రూవియన్ కాన్సెప్ట్‌కు అసలు సిసలు సింబల్. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకురాని ఏరియాలో ఇది ఏర్పాటైంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ ఇలా పుట్టిందే. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1967 మార్చి 16 నుంచి 1968 ఏప్రిల్ 27 వరకూ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చెన్నారెడ్డి పదవిలో ఉన్నప్పుడే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన ప్రక్రియ ముందుకెళ్లింది. అప్పటి ప్రధాని ఇందిర పార్లమెంట్ సాక్షిగా విశాఖలో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. 1971 జనవరి 20న స్టీల్ ప్లాంట్‌కు ఆమె భూమి పూజ చేశారు. 1991లో ఇందులో ఉత్పత్తి మొదలైంది. కానీ, 1992 ఆగస్టు 1 నుంచి స్టీల్ ప్లాంట్ అధికారికంగా ప్రారంభమైంది. అప్పుడు దాని కెపాసిటీ 30 లక్షల టన్నులు. అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. 2006లో విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణ పనులకు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ శంకుస్థాపన చేశారు. ప్లాంట్ సామర్థ్యాన్ని 3.2 మిలియన్ టన్నుల నుంచి 6.3 మిలియన్ టన్నులకు పెంచేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టారు.
బడ్జెట్ లోటు పూడ్చేందుకు అప్పులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.10 లక్షల కోట్ల వరకూ అప్పులు చేసినట్టు చూపించారు. ఈ డబ్బంతా ఏమయ్యింది? ఎక్కడా కొత్తగా పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే.. ఈ పది లక్షల కోట్ల అప్పులను రూ.4 లక్షల కోట్ల రెవెన్యూ లోటును పూడ్చేందుకు, రూ.4.65 లక్షల కోట్లకు పెరిగిన రెవెన్యూ వ్యయం కోసం, రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లోటు పూడ్చేందుకు ఉపయోగించుకోవచ్చు. ఇలా చేస్తే డిమాండ్ పెరిగి.. ఎకానమీ తిరిగి గాడిన పడుతుంది. కానీ, అలా జరగకపోవడం ఆందోళన లకు కారణమవుతోంది. బడ్జెట్ ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘కరోనా పరిస్థితుల కారణంగా, వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణకు ప్రయత్నాలు చేస్తున్నాం. 2021–-22లో బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇం డియా, కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హాన్స్, నీలాచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ సంస్థలకు సంబంధించిన డిజిన్వెస్ట్‌మెంట్‌ను పూర్తి చేస్తాం. ఐడీబీఐ బ్యాంక్ కాకుండా రెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీని ఈ ఏడాది ప్రైవేటైజేషన్ చేసేందుకు ప్రతిపాదిస్తున్నాం. ఇందుకోసం అవసరమైన చట్ట సవరణ లు చేస్తాం’ అని చెప్పారు.
బ్యాంక్స్ నేషనలైజేషన్
1969 జులై 19న బ్యాంకింగ్ కంపెనీస్(అక్విజిషన్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్) ఆర్డినెన్స్‌ను ఇందిరాగాంధీ తీసుకొచ్చారు. 1970లో సరైన నష్టపరిహారం చెల్లించాలనే కారణంతో కోర్టులు బ్యాంకుల నేషనలైజేషన్‌ను నిలిపేశాయి. దీంతో రైట్ టు ప్రాపర్టీ, ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేట్ ప్రాపర్టీని కొంత నష్టపరిహారంతో ప్రభుత్వం సేకరించేందుకు ఇందిరాగాంధీ 25వ రాజ్యాంగ సవరణ చేశారు. ఆ తర్వాత 1971లో బ్యాంకుల నేషనలైజేషన్‌ను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చారు. బ్యాంకుల నేషనలైజేషన్ జరిగి ఇప్పటికి 50 ఏండ్లు పూర్తవుతోంది. కానీ ఇప్పటి ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటైజేషన్ వైపు అడుగు లేస్తోంది.ఇందిరా గాంధీ 14 బ్యాంకులను నేషనలైజ్ చేసినప్పుడు అందులో లాజిక్ ఉంది. అప్పట్లో ఈ బ్యాంకుల వద్ద 85% డిపాజిట్లు ఉన్నాయి. అప్పులు ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి కంట్రోల్ ఉండాలని, సమాజంలో వెనుకబడిన వర్గాల వారికే ఈ రుణాలు అందాలని ఆమె భావించారు. కానీ, ప్రస్తుతం మోడీ గవర్నమెంట్ చేస్తున్న ప్రైవేటైజేషన్ ఐడియా.. కార్పొరేట్లకు రుణ సౌకర్యం ఎక్కువగా కల్పించేలా కనిపిస్తోంది.
పెట్టుబడుల ఉపసంహరణ
పెట్టుబడుల ఉపసంహరణ అనేది కొత్త విషయం కాదు. కానీ, గత ప్రభుత్వాలు పెట్టుబడుల ఉపసంహరణలో స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్ యూనిట్లకు సంబంధించి కాస్త తేడా చూపించాయి. స్ట్రాటజిక్ సెక్టార్స్‌లో డిఫెన్స్, అటామిక్, స్పేస్ మొదలైనవి ఉంటాయి. ఇవి చాలా కీలకమైన రంగాలు. ఇక నాన్ స్ట్రాటజిక్ సెక్టార్‌లో హోటల్స్ మొదలైనవి ఉంటాయి. వీటికి అనుగుణంగా పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టేవారు. కానీ, నరేంద్రమోడీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ కోసం 18 స్ట్రాటజిక్ సెక్టార్లను గుర్తించింది. ఇందులో బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, స్టీల్, ఫెర్టిలైజర్, పెట్రోలియం, డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ మొదలైనవి ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ వాటాను గణనీయంగా తగ్గించుకోవడానికి ఎన్డీయే సర్కారు సిద్ధపడింది. ఇక మహారాష్ట్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి నాలుగు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ప్రైవేటైజేషన్ కోసం షార్ట్ లిస్ట్ చేసింది.వెంకట్ పర్సా, పొలిటికల్ ఎనలిస్ట్.
ఇవి కూడా చదవండి
వ్యక్తిని కట్టేసి కొట్టిన నలుగురు అరెస్ట్
నిలోఫర్ లో 3 నెలలుగా జీతాల్లేవ్
ఈ-మోటార్ సైకిల్ ను లాంచ్ చేసిన అటు మొబైల్ సంస్థ