ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం.. TGSRTC క్లారిటీ

ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం.. TGSRTC క్లారిటీ

హైదరాబాద్: ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రచారంపై టీజీఎస్ ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. డిపోల కార్యకాలపాలన్నీ ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటాయని.. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోలు ప్రైవేట్‌ సంస్థల పరిధిలోకి వెళ్లిపోతున్నాయనే దుష్ర్పచారం పూర్తి అవాస్తవమని స్పష్టత ఇచ్చింది. ఎలక్ట్రిక్ బస్సుల  మెయిన్‌టనెన్స్‌, చార్జింగ్‌ మినహా ఆపరేషన్స్‌ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేసింది.

ఎలక్ట్రిక్‌ బస్సులను నేరుగా కొనాలంటే వ్యయంతో కూడుకున్న పని అని.. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ మేరకు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన అంటే బస్సు తిరిగే కిలోమీటర్ల ప్రకారం కంపెనీలకు చెల్లింపులు చేయడం జరుగుతుంది.. అంతేతప్ప డిపోలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చింది. కేంద్రప్రభుత్వ ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుపాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌(ఫేమ్‌)-1 స్కీమ్‌లో భాగంగా 2019 మార్చిలో 40 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన ప్రవేశపెట్టడం జరిగిందని, పుష్ఫక్‌ పేరుతో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో ఈ బస్సులను సంస్థ నడుపుతోంది. 

Also Read :- మహారాష్ట్ర ఘోర రైలు ప్రమాదంపై సెంట్రల్ రైల్వే క్లారిటీ

ఆ బస్సుల మెయిన్‌టనెన్స్‌, చార్జింగ్‌ మినహా ఆపరేషన్స్‌ అంతా  టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతోందని వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రజలకు సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపింది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్‌ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారం హైదరాబాద్‎తో సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందని తెలిపింది.

2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ ఎలక్ట్రిక్‌ బస్‌ ప్రోగ్రాం(ఎన్‌ఈబీపీ) కింద 550 ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులకు, 500 సిటీ బస్సులకు సొంత టెండర్ ద్వారా ఆర్డర్ ఇవ్వడం ఇవ్వడం జరిగిందని.. వాటిలో 170 సిటీ, 183 జిల్లాల బస్సులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. ప్రైవేట్ సంస్థల జాప్యం వల్ల మిగతా ఎలక్ట్రిక్ బస్సులు రావడంలో ఆలస్యం జరుగుతోంది. మిగిలిన బస్సులు ఈ ఏడాది మే వరకు సంస్థకు అందజేస్తామని ప్రైవేట్ సంస్థలు పేర్కొన్నాయని తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‎లోని ఆరు డిపోలతో పాటు వరంగల్- 2, కరీంనగర్- 2, నిజామాబాద్- 2 డిపోల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని వెల్లడించారు.