- కేంద్రం వెంటనే 8వ పే కమిషన్ను ఏర్పాటు చేయాలి
- ఆర్ఎంయూ జనరల్ సెక్రటరీ ప్రభుచరణ్
కాజీపేట, వెలుగు: రైల్వే ప్రైవేటీకరణను పూర్తిగా ఎత్తి వేయాలని, కేంద్రం వెంటనే రైల్వే8వ పే కమిషన్ ఏర్పాటు చేయాలని రైల్ మజ్దూర్ యూనియన్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ సెక్రటరీ తాళ్లపెల్లి ప్రభుచరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కాజీపేట ఈఎల్ఎస్, డీఎల్ఎస్, కాజీపేట జంక్షన్ లో రైల్వే కార్మిక నేతలతో రైల్వేలో గుర్తింపు సంఘాల ఎన్నికల నేపథ్యంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పదేండ్లలో రైల్వేలో ప్రైవేటీకరణ పెరిగిపోయిందన్నారు.
కాజీపేటలోని మడికొండ లో నిర్మిస్తున్న వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ప్రైవేటుకే అప్పగించనున్నారన్నారు. రైల్వేలో శానిటేషన్, కోచ్ ల్లో అటెండెంట్లు, ఇతర కొన్ని విభాగాలను ప్రైవేటీకరించారన్నారు. 7 వ పే కమిషన్ లో ప్రతిపాదించిన విధంగా రైల్వే కార్మికులకు 46 వేలు బోనస్ గా ఇవ్వాల్సి ఉండగా 17 వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే కార్మికుల సంఖ్య 18 లక్షల నుంచి 13లక్షలకు తగ్గిందన్నారు.
ఒక్క సౌత్ సెంట్రల్ రైల్వేలో ఖాళీగా ఉన్న 10వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రతి ఏటా 2 శాతం కొలువులను రిటైర్ మెంట్లతో సరెండర్ చేస్తున్నారని, తిరిగి వాటిని భర్తీ చేయడం లేదన్నారు. రైల్వే కార్మికుల సమస్యలపై మాట్లాడే గొంతుకగా ఉన్న ఆర్ఎంయూను వచ్చే రైల్వే గుర్తింపు సంఘాల ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆర్ఎంయూ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సురమల్లేశ్వర్ రావు, నేతలు కృష్ణ, రామారావు, సదానందం పాల్గొన్నారు.