![స్ట్రెయిట్ తెలుగు మూవీలో ప్రియా భవానీ శంకర్](https://static.v6velugu.com/uploads/2022/10/PRIYA-BHAVANI-SHANKAR-STRAIGHT-TELUGU-MOVIE_bU8esmWOjz.jpg)
ఇతర భాషల అమ్మాయిలకు టాలీవుడ్ ఎప్పుడూ స్వాగతం చెబుతూనే ఉంటుంది. ఇప్పుడు మరో అమ్మాయి తెలుగునాట అడుగు పెడుతోంది. ఆమె ఎవరో కాదు.. ప్రియా భవానీ శంకర్. ఇప్పటి వరకు పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రియ.. ఇప్పుడొక స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయబోతోంది. సత్యదేవ్, డాలీ ధనుంజయ లీడ్ రోల్స్‌లో ఓ సినిమా రూపొందుతోంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప్రియని హీరోయిన్‌గా తీసుకున్నట్లు నిన్న ప్రకటించారు. ఆమె ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో నటిస్తోందని రివీల్ చేశారు. మరో హీరోయిన్ కూడా ఉంటుందని, త్వరలోనే తన పేరును ప్రకటిస్తామని చెప్పారు.
ప్రియ చేతిలో ప్రస్తుతం ఐదారు తమిళ ప్రాజెక్టులున్నాయి. లారెన్స్ ‘రుద్రన్’, శింబు ‘పత్తు తల’ చిత్రాలతో పాటు ‘ఇండియన్2’లోనూ ఆమె కీలక పాత్రలు పోషిస్తోంది. మరో రెండు సినిమాలు పూర్తయ్యి రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. నాగచైతన్య తెలుగు, తమిళ బైలింగ్వల్ వెబ్ సిరీస్ ‘దూత’లోనూ ప్రియ నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకి కూడా సెలెక్టయ్యింది కాబట్టి ఇకపై తెలుగులోనూ బిజీ అవుతుందేమో చూడాలి మరి.