మాజీ మంత్రి నారాయణ వేధిస్తుండు.. తమ్ముడి భార్య ఫిర్యాదు

గచ్చిబౌలి, వెలుగు: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తూ అతడి తమ్ముడి భార్య ఆదివారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. గచ్చిబౌలిలోని మీనాక్షి బ్యాంబూస్ విల్లాస్​లో నారాయణ తమ్ముడు సుబ్రమణ్యం భార్య ప్రియా పొంగురు ఉంటోంది. నారాయణతో పాటు తన భర్త సుబ్రమణ్యం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్టు ఆమె ఫిర్యాదు చేసింది. తను ఇన్ స్టా వేదికగా వీడియో పోస్ట్ చేయడంతో వేధింపులు ఎక్కువయ్యాయని, నారాయణ, అతడి తమ్ముడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. తనకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని, క్యాన్సర్​నుంచి కోలుకున్నానని, తనకు ఎదురైన ఇబ్బందులపై ఇన్​స్టాలో పోస్ట్ చేసినట్లు పేర్కొంది. 

కొందరు దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారని ఆరోపిస్తూ.. నారాయణ పెట్టిన మానసిక హింసను సోషల్ మీడియా వేదికగా ప్రజల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను వేధింపులకు గురి చేసిన మాజీ మంత్రి నారాయణ, అతని తమ్ముడిపై ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు. దీంతో పోలీసులు కంప్లైంట్​తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.