Darling Review : ‘డార్లింగ్’ మూవీ రివ్యూ..ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే?

Darling Review : ‘డార్లింగ్’ మూవీ రివ్యూ..ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే?

వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపును అందుకున్న ప్రియదర్శి (Priyadarshi)..జాతిరత్నాలు, మల్లేశం, బలగం లాంటి చిత్రాలతో హీరోగానూ మెప్పించాడు. ఈ క్రమంలో అతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డార్లింగ్ (Darling). శుక్రవారం జులై 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన డార్లింగ్ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించగా..ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెట్‌ కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించింది. రిలీజ్ కు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన డార్లింగ్ టాక్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

క‌థేంటంటే: 

రాఘ‌వ (ప్రియ‌ద‌ర్శి) ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. రాఘవ తండ్రి (ముర‌ళీధ‌ర్ గౌడ్‌) కొడుకుకి పెళ్లి చేయాలనే ఆశతో ఉంటాడు. ఇక రాఘవకు తన వయస్సు ఎదుగుతున్న క్రమంలో ఒక డ్రీంలో బతుకుతుంటాడు. ఎలాగైనా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫారన్కి హనీమూన్ వెళ్లాలనేది అతని చిరకాల కోరిక. ఈ క్రమంలో తండ్రి చూసిన సైకాల‌జిస్ట్ నందిని (అన‌న్య నాగ‌ళ్ల‌)తో సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసుకోవాలని రెడీ అవుతాడు. కానీ, నందిని చివరి నిమిషంలో తాను ప్రేమించిన అబ్బాయితో  వెళ్లిపోతుంది. ఇక రాఘవ మ్యారేజ్..అతను కన్న కల ఆ పెళ్లి పీట‌లపైనే అర్ధాంతంగా ఆగిపోతుంది. దీంతో రాఘవకు జీవితంపై విర‌క్తి చెంది..ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి డిసైడ్ అవుతాడు.ఇక సరిగ్గా ఆ టైంలోనే ఆనంది (న‌భా న‌టేష్‌) రాఘవ జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె ప‌రిచ‌య‌మైన కొద్ది గంట‌ల్లోనే రాఘ‌వ ప్ర‌పోజ్ చేయ‌డం..ఆ వెంట‌నే పెళ్లి చేసుకోవ‌డం అంత చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. కాక‌పోతే రాఘవ ఫస్ట్ నైట్ రోజే  ఆనంది చేత పాల గ్లాసుకు బదులుగా చావు దెబ్బ‌లు తింటాడు.డార్లింగ్ లో మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్‌ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే యువ‌తిగా న‌భాన‌టేష్ క‌నిపిస్తోంది. 

పెళ్లి త‌ర్వాత భార్య‌కు మ‌ల్టీపుల్‌ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ ఉంద‌ని తెలిసిన రాఘ‌వ ఏం చేశాడు? ఈ స‌మ‌స్య కార‌ణంగా రాఘ‌వ ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? భార్య‌కున్న స‌మ‌స్య‌ను అర్థం చేసుకున్నాడా లేదా అన్న‌దే ఈ మూవీ క‌థ‌. అయితే, ఆనందిలో ఉన్న ఐదు పర్స‌నాలిటీస్ (ఆది, మాయ‌, ఝాన్సీ, పాప‌, శ్రీశ్రీ) ఎవ‌రు? వాళ్ల ల‌క్ష్యం ఏంటి? చివరికి వీరి కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే. 

ఎలా ఉందంటే: 

ఇప్పటికీ చాలా మంది హీరోలు, హీరోయిన్స్కి తమకున్న మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్‌ స‌మ‌స్య‌తో బాధపడుతూ చేసిన సినిమాలు ఇదివరకే చూశాం. అయితే ఇప్పటికి వచ్చిన సినిమాల్లో కోపంతో క్రైమ్ చేసే వారిని చూసాం. కానీ, ఈ సినీమాలో మాత్రం ఆనందిలో ఉన్న ఐదు పర్స‌నాలిటీస్ (ఆది, మాయ‌, ఝాన్సీ, పాప‌, శ్రీశ్రీ) లను చాలా చక్కగా వినోదాత్మ‌కంగా చూపించేశాడు డైరెక్టర్. ఒక తల్లిలా,చెల్లిగా ఉన్నప్పుడు ప్రేమ ఒకలా ఉంటుంది. అదే లవర్ గా..ఇక లవర్ ఏ భార్యగా అయితే పిచ్చి పిక్స్ మరోలా ఉంటుందనే అంశాలు చాలా చక్కగా డిజైన్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత భార్య చేతిలో కీలు బొమ్మ‌గా మారిన భ‌ర్తల స్టోరీని ఇదివరకే చూసిన కానీ, ఇందులో మాత్రం వారి పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌తోనే కథను క్లారిటీగా చెప్పేశారు ద‌ర్శ‌కుడు అశ్విన్ రామ్‌. భార్య‌తో క‌లిసి పారిస్‌కు హ‌నీమూన్‌కు వెళ్లాల‌ని క‌ల‌లు క‌నే కుర్రాడి జీవితంలోకి అప‌రిచితురాల్లాంటి అమ్మాయి భార్య‌గా వ‌స్తే ఏమైంద‌నేది ఈ మూవీ నేపథ్యం .అయితే, ఇలాంటి సరదా సన్నివేశాలు, అలకలు, కోపం వీటితో కూడిన పాయింట్‌ను స‌రిగ్గా వాడుకుంటే..అందులో నుంచి మంచి కమ్మటి కామెడీని చూపించడానికి డైరెక్టర్ కు అవకాశం ఉంటుంది.కానీ, అశ్విన్ మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక‌పోయారు. 

ఫస్టాఫ్ లో స్టోరీని తాను ఏదైతే అనుకున్నాడో దాన్ని సరిగ్గా కామెడీ టైమింగ్ తో చూపించడంలో అశ్విన్ సక్సెస్ అయ్యాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా రాఘవ్ లైఫ్, అతని పారిస్ కల, పెళ్లి పెటాకులవడం, ఆనంది పరిచయం, పెళ్లి, ఆమెలో ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీస్ తో రాఘవ్ పడే బాధలతో కామెడీగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా నవ్వుకుంటారు. ఇంటర్వెల్ కి ఆమెలో మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయని షాక్ ఇస్తారు.

సెకండాఫ్ లో మాత్రం కథను ఎమోషనల్ గా చూపించాలో లేదా కామెడీగా చూపించాలో తెలియక కొన్నిచోట్ల తడబడ్డాడని అర్ధమవుతోంది. అంతేకాకుండా హీరోయిన్ నభనటేష్ లో ఉన్న మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్‌ సమస్యలోని సంఘ‌ర్ష‌ణ‌ను ప్ర‌భావవంతంగా తెర‌పైకి తీసుకురాలేక‌పోవ‌డం..ఆమెకున్న సమస్యను పోగొట్ట‌డానికి హీరో చేసే ప్ర‌య‌త్నాలు సిల్లీగా మ‌రీ సినిమాటిక్‌గా ఉండ‌టం కాస్తా ఆడియన్స్ ను నిరాశపరిచేలా చేశాయనే ఫీలింగ్ కలుగుతోంది. అలాగే హీరోయిన్ సమస్యకు గల కారణాలతో కూడిన గతాన్ని బలంగా చెప్పలేకపోవడంఒకింత ఆడియన్స్ కు బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇకపోతే భార్యతో జరిగే గొడవ సీన్స్ ను కామెడీగా సాగిస్తూనే తన భార్యని ఎలా అయినా కాపాడుకోవాలని రాఘవ్ పడే తపనని ఎమోషనల్ గా చూపించారు.  క్లైమాక్స్ విష‌యంలో మాత్రం తన అశ్విన్ తన పెన్నుకు ఇంకాస్తా పదును పెట్టుంటే బలమైన ఫీలింగ్ క్రియేట్ అయ్యేలా ఉండేది. 

ఎవ‌రెలా చేశారంటే: 

భార్య చేతిలో బాధపడే భర్తగా రాఘ‌వ పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి చ‌క్క‌గా ఒదిగిపోయారు. త‌న‌దైన కామెడీ, ఎమోషన్ తో ప్రేక్షకుల్ని అలరిస్తాడు. ఇకపోతే తనదైన టైమింగ్‌తో ప్రతి సీన్ లో ఆద్యంతం న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. అలాగే ఆనందిగా నటించిన న‌భా న‌టేష్ ఒకరకంగా ఈ సినిమాకు తనే హీరో అని చెప్పొచ్చు. అయిదు స్ప్లిట్ పర్సనాలిటీలతో అయిదుగురిలా మార్చి మార్చి నటించి నభా ప్రతి ఫ్రేమ్ లో అదరగొట్టేసింది. అలాగే, నాభా..ప్రియద‌ర్శికి మ‌ధ్య వ‌చ్చే ఫ‌న్నీ సీన్స్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాయి. కీ రోల్స్ లో నటించిన అన‌న్య నాగ‌ళ్ల‌, ముర‌ళీధ‌ర్ గౌడ్ మెప్పిస్తారు. ఇకపోతే గెస్ట్ పాత్రల్లో సుహాస్, నిహారిక మెప్పిస్తారు. బ్రహ్మానందం, రఘుబాబు, విష్ణు, కృష్ణ తేజ, త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. 

సాంకేతిక అంశాలు: 

డైరెక్టర్ ఎంచుకున్న కథను చాలా బాగా రాసుకున్నాడు. తనదైన కామెడీతో అందరి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. కానీ,ముఖ్యంగా క‌థ‌లోని ఎమోష‌న్‌ను,కామెడీని స‌రిగ్గా బ్యాలెన్స్ చేయ‌లేక‌పోయారు.  సినిమాటోగ్రఫీ నరేష్ రామదురై విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నా ఎడిటింగ్ కు కాస్త పనిపెట్టి ఉంటే బాగుండేది. వివేక్ సాగ‌ర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టారు. కొన్ని పాటలను ఇంకాస్త బెటర్ గ చేస్తే ఆడియన్స్ కు బలంగా ఎక్కేవి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.