భద్రాద్రికొత్తగూడెంలో ప్రజాపాలనకు పక్కాగా ఏర్పాట్లు : ప్రియాంక అల

  • ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్​ ఏర్పాటు చేస్తున్నాం
  • అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడమే లక్ష్యం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రోగ్రామ్​ను పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​డాక్టర్​ప్రియాంక అల తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించనున్నామని చెప్పారు. ఈ క్రమంలో కలెక్టర్​ ‘వెలుగు’తో మాట్లాడుతూ ప్రోగ్రామ్ పూర్తి  వివరాలు వెల్లడించారు. 

ఉదయం 8 గంటల నుంచే అప్లికేషన్లు తీసుకుంటాం

ఈనెల 28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన ప్రోగ్రామ్​నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 31, జనవరి 1 మినహా అన్ని రోజుల్లో ప్రజా పాలన కార్యక్రమం జరుగుతుంది. అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక చోట, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు  మరో చోట.. రోజుకు రెండు ప్రాంతాల్లో గ్రామ సభల నిర్వహణ ఉంటుంది. 

ఎప్పటికప్పుడు ఆన్​లైన్​ చేసేందుకు ఏర్పాట్లు

మహాలక్ష్మి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత స్కీమ్​లకు సంబంధించి ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకుంటాం. వాటిని ఎప్పటికప్పుడు ఆన్​ లైన్​ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

అప్లికేషన్​కు రిసీట్​తీసుకోవాలి

అప్లికేషన్​తో పాటు ఆధార్, రేషన్​కార్డు జిరాక్స్​కాపీలను జత చేయాల్సి ఉంటుంది. కుటుంబ పెద్ద ఫొటో ఇవ్వాలి. అప్లయ్ చేసిన తర్వాత అధికారుల నుంచి రశీదు పొందాలి. 

ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్

గ్రామాలు, మున్సిపల్​వార్డుల వారీగా గ్రామ సభలు నిర్వహిస్తాం. ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్​ ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటాం. అప్లికేషన్లను క్లియర్​గా నింపేందుకు వీలుగా ఏదైతే గ్రామంలో గ్రామసభ నిర్వహించాల్సి ఉంటుందో ఆ గ్రామంలో ముందురోజే దరఖాస్తులను అందజేస్తాం. అదే రోజు టామ్​ టామ్​ వేయించి ప్రజలకు సమా చారం ఇస్తాం. నిరక్షరాస్యులకు దరఖా స్తులను నింపేందుకు హెల్ప్​ డెస్క్​లను ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా కుర్చీలు, టెంట్లు, తాగు నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నాం.