పాల్వంచ, వెలుగు : డ్రైనేజీలు, లోతట్టు, ఖాళీ ప్రాంతాల్లో పేరుకుపోతున్న చెత్త, మురుగును ఎప్పటికప్పుడు తొలగించాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల సిబ్బందిని ఆదేశించారు. శనివారం పట్టణంలోని అయ్యప్పనగర్, శ్రీనివాస కాలనీల్లో ఆమె ఆకస్మికంగా పర్యటించారు. మురుగునీటి నిలువలు ఉన్న ప్రాంతాల్లో దోమల వ్యాప్తి నిరోధానికి గంబుషియా చేపలు, ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. ప్రతి ఇంటి నుంచి వ్యర్థాల సేకరణ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామి, తాహసీల్దార్ నాగరాజు ఉన్నారు.
ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి
పాల్వంచ, వెలుగు : వచ్చే పార్ల మెంటు ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలను చేపడుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. శనివారం స్థానిక పాత పాల్వంచ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఆదివారం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు తొలగింపులకు సంబంధించిన కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.