- రాహుల్ ఆ స్థానాన్ని వదులుకుంటే ఉప ఎన్నికల్లో పోటీ
- కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని అందరూ భావించారు. ఆమె అమేథీ లేదా వారణాసి నుంచి బరిలో ఉంటారని చర్చలు నడిచాయి. కానీ, ఆమె ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వహించడం వీలుకాదంటూ పోటీనుంచి తప్పుకున్నారు. తాజాగా, మళ్లీ ప్రియాంక పోటీపై చర్చ నడుస్తోంది. కేరళలోని వయనాడ్ స్థానాన్ని రాహుల్‌గాంధీ వదులుకుంటే.. ఆ స్థానంలో వచ్చే ఉప ఎన్నికల్లో ప్రియాంక బరిలో నిలుస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ వయనాడ్‌తోపాటు యూపీలోని రాయ్బరేలీనుంచి పోటీ చేశారు. ఈ రెండు చోట్లా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు ఇందులో ఏదో ఒక సీటును ఆయన వదులుకోవాల్సిందే. ఒకవేళ తన చెల్లెలు ప్రియాంక గనుక వారణాసిలో పోటీ చేసి ఉన్నట్టైతే ప్రధాని నరేంద్ర మోదీ 2లక్షల నుంచి 3లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారని రాహుల్ ఇటీవల కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వదులుకున్న సీటులో ప్రియాంకాగాంధీని పోటీకి నిలుపుతారనే చర్చ జోరుగా సాగుతోంది.
రాహుల్ వయనాడ్‌నే వదులుకుంటారా?
రాయ్‌బరేలీ, వయనాడ్‌లో గెలిచిన రాహుల్‌గాంధీ.. ఈ రెండింట్లో దేన్ని వదులుకోవాలో అనేదానిపై డైలమాలో ఉన్నట్టు సమాచారం వయనాడ్‌ను వదులుకోవద్దని అక్కడి కాంగ్రెస్ నేతలు రాహుల్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలను నిరుత్సాహపర్చకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన రాయ్‌బరేలీని నిలబెట్టుకుని, వయనాడ్ నుంచి ప్రియాంకాగాంధీని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్‌ను ఎంపీ చేసింది వయనాడ్ నియోజకవర్గం. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ఈసారి అఖిలేశ్‌యాదవ్, రాహుల్ గాంధీ సారథ్యంలో ఇండియా కూటమి సత్తా చాటింది.
బీజేపీకి కంచుకోటగా ఉన్న ఇక్కడ 80 సీట్లలో 43 స్థానాలను కైవసం చేసుకుంది. 2019లో కేవలం ఒక్కస్థానానికే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఒంటరిగా ఆరు స్థానాల్లో గెలిచింది. అలాగే, రాబోయే రోజుల్లో దేశంలో అధికారంలోకి రావాలంటే యూపీ కీలకం. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈ స్థానాన్ని నిలబెట్టుకొని, వయనాడ్ నుంచి ప్రియాంకను పోటీకి నిలుపుతారనే చర్చ నడుస్తోంది.